చంద్రబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయం: ఏపీ మంత్రులు, వైవీ సుబ్బారెడ్డి వ్యంగ్యాస్త్రాలు
అమరావతి: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటమికి భయపడే పోటీ నుంచి తప్పించుకున్నారని అన్నారు.ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, గౌతమ్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు చేతగానితనమేనంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చేతగాని తనాన్ని తమపై నెడుతున్నారని మండిపడ్డారు. అనైతిక రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ పార్టీ మూసేయచ్చంటూ మంత్రి గౌతమ్ రెడ్డి..
మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనకపోతే పార్టీ ఎందుకు? ఇక టీడీపీ ఆఫీసును మూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నాయకత్వం ఎలా ఉండాలో.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలన్నారు. ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు ఇచ్చాక.. చంద్రబాబు విబేధించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందశాతం ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారన్నారు.

చంద్రబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయమంటూ కన్నబాబు
చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకనే ఎన్నికలకు దూరంగా పారిపోతున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గత ఎన్నికల సంఘం కమిషనర్ నిర్ణయాన్నే కొత్త ఎస్ఈసీ కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ధాటికి చంద్రాబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు.

చంద్రబాబు ప్రకటన ఓ డ్రామా అంటూ వైవీ సుబ్బారెడ్డి ఫైర్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిష్కరణ ప్రకటన ఓ డ్రామా అభివర్ణించారు. నాటకాలాడటంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పోటీ నుంచి తప్పించుకుంటున్నారన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అన్ని వర్గాలకు గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇది ఇలావుంటే, చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై సొంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే జ్యోతుల నెహ్రూ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది సరైన నిర్ణయం కాదని మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.