ఫిట్ మెంట్ 23 శాతమే-ఉద్యోగ నేతలకు తేల్చిచెప్పిన జగన్ సర్కార్-మళ్లీ పీటముడి
ఏపీలో ఇప్పటికే ప్రకటించిన పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో వెనక్కి తగ్గేందుకు మంత్రుల కమిటీ నిరాకరించింది. నిన్న రాత్రి నుంచి ఉద్యోగులతో పలు దఫాలుగా చర్చలు కొనసాగిస్తున్న మంత్రుల కమిటీ.. ఇవాళ సాయంత్రం భేటీ అయిన సందర్భంగా తుది ప్రతిపాదనలు చేసింది. ఇందులో పీఆర్సీ శాతం పెంచేందుకు మాత్రం అంగీకరించలేదు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే సీఎం జగన్ తో చర్చల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఉద్యోగుల పీఆర్సీ సాధన సమితి నేతలతో నిన్నటి నుంచి పలు దఫాలుగా సమావేశమవుతున్న మంత్రుల కమిటీ పలు ప్రతిపాదనలు చేస్తోంది. ఇందులో పీఆర్సీ ఫిట్ మెంట్ పై మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ దశలో ఫిట్ మెంట్ పై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పినా ఆ దిశగా కూడా అడుగులు పడటం లేదు. ప్రకాశం జిల్లాలో మాట్లాడిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 27 శాతం ఫిట్ మెంట్ కు సీఎఁ జగన్ సముఖంగా ఉన్నారని, దీని వల్ల రూ.5600 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. దీంతో పీఆర్సీ ఫిట్ మెంట్ శాతం పెరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. కానీ మంత్రుల కమిటీ మాత్రం ఫిట్ మెంట్ శాతంపై కొత్త ప్రతిపాదనలేవీ చేయలేదు.

అయితే హెచ్ఆర్ఏ స్లాబ్లపై మాత్రం మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇందులో 50 వేల జనాభా లోపు ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్ తో 8 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని తెలిపింది. అలాగే 2 లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్ తో 9 .5 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని ప్రతిపాదించింది. 5 లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ. 12 వేల సీలింగ్ తో 13 . 5 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని వెల్లడించింది. 10 లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్ తో 16 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామంటోంది.
అలాగే సచివాలయం, హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్ తో 24 శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తరువాత కొత్త పీఆర్సి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు ఐఆర్ కూడా రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సి అమలుకు మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసింది.