andhra pradesh ministers ysrcp tdp win ys jagan target kodali nani ap news ap govt మంత్రులు వైఎస్సార్సీపీ టీడీపీ విజయం కొడాలి నాని ఏపీ ప్రభుత్వం politics
జగన్ టార్గెట్లు- స్వస్ధలాల్లో మంత్రుల అవస్ధలు- వైసీపీ ఓడితే పదవులు హుళక్కేనా ?
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో ఎలాగైనా గెలిచి తీరాలన్న సీఎం జగన్ ఆదేశాలతో మంత్రులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. అయినా పలుచోట్ల ఓటములు తప్పడం లేదు. ప్రత్యర్ధుల దూకుడుకు అడ్డుకట్టే వేసేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సీఎం జగన్ టార్గెట్లు అందుకోలేక మంత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగ స్వస్ధలాల్లో సైతం వైసీపీ అభ్యర్ధులను గెలిపించుకోవడంలో వైఫల్యం వారికి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
నిమ్మగడ్డతో జగన్ సర్కార్ రాజీ ? మార్చిలోపే అన్ని ఎన్నికలు- అసలు కారణాలివేనా ?

పంచాయతీ పోరులో మంత్రులకు ముచ్చెమటలు
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకూ చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో అథ్యధిక పంచాయతీలు గెల్చుకోవాల్సిందేనని అధిష్టానం నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, సీఎం జగన్ స్వయంగా మంత్రులకు పెట్టారని చెబుతున్న టార్గెట్లు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో పంచాయతీ పోరులో ప్రత్యర్ధుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వారు సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో మంత్రులు వైసీపీని గెలిపించడంలో విఫలమయ్యారన్న నివేదికలు ప్రభుత్వానికి చేరడం వారిని మరింత కలవరపెడుతోంది.

వైసీపీ మంత్రుల్ని టార్గెట్ చేసిన టీడీపీ
పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు, ఎవరు ఎవరి సాయంతో గెలుస్తున్నారన్నది క్షేత్రస్ధాయిలో మాత్రం అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తే సత్తా చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు లైట్ తీసుకున్న వారి స్వస్ధలాల్లో గట్టి అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలమర్రులో టీడీపీ అభ్యర్ది శిరీష విజయం ఇలాంటిదే. ఇదొక్కటే కాదు రాష్ట్రంలో దాదాపు సగం మంది మంత్రుల నియోజకవర్గాల్లో, స్వస్ధలాల్లో ప్రత్యర్ధులు వైసీపీ అభ్యర్ధులకు గట్టి పోటీ ఇస్తున్నారు.

మంత్రులకు ప్రతిష్టాత్మంగా స్వస్ధలాలు
వైసీపీ మంత్రులు ఇప్పటివరకూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిస్తే చాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ సహా ఇతర ప్రత్యర్ధి పార్టీలు వారు పుట్టిన స్ధలాలు, మంత్రులు బలంగా భావించే పంచాయతీలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయా స్దానాల్లో వైసీపీ గెలుపు ఇప్పుడు మంత్రులకు కీలకంగా మారిపోయింది. దీంతో తొలి రెండు దశల్లో దృష్టిపెట్టని స్వస్ధలవైపు మంత్రులు పరుగులు తీయాల్సిన పరిస్దితి. ప్రత్యర్ధులకు ఏ చిన్న అవకాశం దక్కినా మీడియాలో గోరంతలు కొండంతలు చేసి చూపించే పరిస్ధితుల్లో సొంత నియోజకవర్గాలతో పాటు స్వస్దలాల్లోనూ మంత్రులు పూర్తి స్ధాయిలో దృష్టిపెడుతున్నారు.

పోరు గెలవకుంటే మంత్రి పదవులకు ముప్పు
వైసీపీ మంత్రులకు సీఎం జగన్ పెట్టిన టార్గెట్ బట్టి చూస్తుంటే వారి స్వస్ధలాల్లో, నియోజకవర్గాల్లో కచ్చితంగా మెజార్టీ స్దానాలు గెలిపించుకుంటే ఒకే. లేకపోతే మాత్రం మంత్రి పదవులకు కూడా ముప్పు తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్ధి పార్టీలు సత్తా చూపుతున్నాయన్న ఇంటిలిజెన్స్ నివేదికల నేపథ్యంలో తమ పదవులు కాపాడుకోవాలంటే తదుపరి రెండు దశల్లో మంత్రులు తప్పనిసరిగా వైసీపీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మంత్రులు మరింత చెమటోడ్చక తప్పని పరిస్ధితి నెలకొంటోంది. వాస్తవానికి సీఎం జగన్ మంత్రులకు ఇచ్చిన రెండున్నరేళ్ల పదవీకాలం ఎలాగో డిసెంబర్‌తో పూర్తి కానుంది. ఆ లోపు వైసీపీ ఓటమికి కారకులుగా పదవులు కోల్పోయి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.