చంద్రబాబు చెప్పగలరా - వారంతా ఏకమైనా విజయం వైసీపీదే : మంత్రుల సవాల్..!!
ఏపీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి యాత్ర చివరి దశకు వచ్చింది. ఈ రోజుతో యాత్ర ముగియనుంది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ రోజు అనంపతురంలో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుంది. బస్సుయాత్ర మూడోరోజున ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. సమసమాజ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని చంద్రబాబు యాత్రలో పాల్గొన్న మంత్రులు సవాల్ చేసారు.

ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా..
ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సింహం సింగిల్ గానే పోటీ చేస్తుందంటూ సీఎం జగన్ గురించి చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్ అని మంత్రులు స్పష్టం చేసారు. మూడోరోజు సామాజిక న్యాయభేరి యాత్ర తాడేపల్లిగూడెంలో ప్రారంభమై ఏలూరు, విజయవాడ, చిలకలూరిపేట మీదుగా రాత్రికి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో పలువురు మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ను ఓడించటానికి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని చంద్రబాబు చెబుతున్నారంటూ ఎద్దేవా చేసారు.

చంద్రబాబుకు అధికారం దక్కదు
ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. పొర్లు దండాలు పెట్టినా అధికారం దక్కదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వం పంచుతున్నామని చెబుతున్నారని.. ఆ పంచుడులో ఎక్కడైనా అవినీతి జరిగిందా అంటూ సీనియర్ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. రైతులకు..అణగారిన వర్గాలకు తాము లబ్ది చేస్తున్నామని..అది కనిపించటం లేదా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ నాయకత్వంలో సామాజిక విప్లవం వెల్లివిరుస్తోందని మంత్రులు పేర్కొన్నారు.

లక్షా 36 వేల కోట్ల ఖర్చు చేసి
మూడేళ్ల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలకు లక్షా 36 వేల కోట్లు ఖర్చు చేస్తే..అందులో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని మంత్రులు వివరించారు. ఇక, ఈ రోజు చివరి రోజు యాత్రలో భాగంగా.. నంద్యాలలో ప్రారంభమై.. బస్సు యాత్ర కర్నూలు, డోన్ మీదుగా అనంతపురం చేరుకోనుంది. సాయంత్రం 4 గంటలకు.. అనంతపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో సామాజిక న్యాయభేరి సభ నిర్వహించనున్నారు.