చిన్న సమన్యను జటిలం చేసుకోవద్దు.. చర్చించుకుందాం రండి : ఉద్యోగులకు జగన్ సర్కార్ ఆహ్వానం
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన "చలో విజయవాడ" సక్సెస్ అయింది. పోలీసుల నిర్భందాలను చేధించి మరీ బెజవాడకు లక్షలాది మంది ఉద్యోగులు చేరుకున్నారు. తమ బల బదర్శనను విజయవాడ నడి వీధుల్లో చూపించారు. భారీ ర్యాలీని నిర్వహించారు. దీంతో పోలీసులు కూడా చేసేది ఏమిలేక చేతులెత్తేశారు. ఇది చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేశాయి. ఆర్థరాత్రి తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెప్పాయి.

జీతాలు ప్రాసెస్ చేశాక ఆపమని చెప్పడం సరికాదు..
ఉద్యోగలు చలో విజయవాడపై ఏపీ ప్రభుత్వ పెద్దలు స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జీతాలు ప్రాసెస్ చేశాక ఆపమని చెప్పడం సరికాదన్నారు. పీఆర్సీ అమలులో సమస్యలుంటే ఉద్యోగులతో కలిసి కర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఉద్యోగులతో పోలీసులు సంయమనంతో వ్యవహరించారు
మొదటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించిందని తెలిపారు. కరోనా ఆంక్షలు పాటించాలని చెప్పామని.. కానీ ఆ నిబంధనలకు ఉద్యోగులు తుంగలో తొక్కారని విమర్శించారు. అయినా ఉద్యోగులతో పోలీసులు సంయమనంతో వ్యవహరించారని మంత్రా బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

చిన్న సమస్యకు ఇంత రాద్ధాంతమా..
ఉద్యోగ సంఘాల నేతలు చిన్న సమస్యను కూడా ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు వచ్చి ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి వేల కోట్లు అప్పులు ఉన్నా విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా అవకాశం ఉన్నంతమేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి.
ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 2008, 2018 డీఎస్సీలను పరిష్కరించి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలని చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు ఏది కావాలంటే అది చేసిందన్నారు. ఇంత దాకా రావాల్సిన అవసరమే లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.