ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా: అన్నా వెంకటరాంబాబు దంపతులు, కరణం బలరాంకు పాజిటివ్..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అన్నా వెంకట రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా వైరస్ సోకింది.

రాంబాబుకు కరోనా..
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో భార్యతో కలిసి ఒంగోలులో గల రమేశ్ సంఘమిత్ర ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా.. ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. అయితే కుటుంబసభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఇటీవలే ఎమ్మెల్యే వెంకట రాంబాబు పుట్టినరోజు వేడుకగా జరిగాయి. చాలా మంది హాజరవడంతో ఉత్కంఠ నెలకొంది.

నెలక్రితం మనవడికి..
నెల రోజుల క్రితం రాంబాబు మనవడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంగోలులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే బర్త్ డే లేదంటే మనమడి ద్వారా సోకిందా అనే అంశంపై స్పష్టత లేదు.అన్నా రాంబాబుతో సన్నిహితంగా ఉంటోన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆయనను కలిసిన, అధికారులు సిబ్బంది కూడా కరోనా పరీక్ష చేయించుకుంటున్నారు.

కరణం బలరాంకు
ఇటు ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా కరోనా వైరస్ సోకింది. బంజారాహిల్స్లో గల స్టార్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. కరణం కుటుంబ సభ్యులు, ఆయనతో కాంటాక్ట్ అయిన వారంరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరణం బలరాంను కలిసిన నేతలు, కార్యకర్తల్లో కూడా వారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.

కరోనా సోకిన ప్రజా ప్రతినిధులు వీరే..
ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు కరోనా బారినపడ్డారు. వీరిలో అంజద్ బాషా, అంబటి రాంబాబు తదితరులు కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇటీవల కరోనా వైరస్ను జయించిన సంగతి తెలిసిందే.

లక్ష 60 వేలు దాటిన పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఏకంగా 7,822 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 63 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 1,500 దాటాయి. గత 24 గంటల్లో 45,516 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 7,822 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,66,586కు చేరింది.