జగన్‌కు అసలు పరీక్ష-రాజధానులు, వైజాగ్ స్టీల్‌పై రిఫరెండం-రెండుచోట్ల ఎదురీత తప్పదా ?
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత వాటిని చట్ట, కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా సమర్ధించుకున్న వైసీపీ సర్కారు, సీఎం జగనన్‌కు ఇప్పుడు జనంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. జనం రాజధానులను సమర్ధిస్తున్నారా లేదా అనే ఈ పరీక్షను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేల్చబోతున్నాయి. అయితే ఇప్పటికే రాజధానుల విభజన ద్వారా విజయవాడ కార్పోరేషన్లో అసంతృప్తి మూటగట్టుకున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడు విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం కూడా అంత సులువుగా కనిపించడం లేదు. దీనికి కారణం వైజాగ్ స్టీల్ ఉద్యమమే. దీంతో మూడు రాజధానుల్లో వైసీపీకి రెండు చోట్ల ఎదురీత తప్పడం లేదు.
కొటియా పంచాయతీ- సుప్రీంలో జగన్ సర్కార్ అఫిడవిట్- ఒడిశా వివరణకు 4 వారాల గడువు

మున్సిపల్ పోరు వైసీపీకి అసలు పరీక్ష
ఏపీలో మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న మున్సిపల్ ఎన్నికల సంగ్రామం వైసీపీకి అసలు సిసలు సవాల్‌గా మారబోతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం సీట్లు సాధించామని చెప్పుకుంటున్న వైసీపీకి మున్సిపల్ పోరులో ఈ ఫీట్‌ను రిపీట్ చేయడం లేదా ఇంతకు మించిన ఫలితాలను రాబట్టడం సవాల్‌గా మారింది. పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ పోరుతో పోలిస్తే నేరుగా పార్టీ అభ్యర్ధులతోనే జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు అసలైన గెలుపు కానుంది. అన్నింటికంటే మించి జగన్ మూడు రాజధానులను సమర్ధించుకోవాలంటే ఇందులో నెగ్గి తీరాల్సిన పరిస్ధితి.

జగన్ రెండేళ్ల పాలనకు రెఫరెండంగా
మరో రెండు నెలల్లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ముఖ్యంగా భారీ ఎత్తున సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నా, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం ఆగడం లేదు. అటు కక్షసాధింపు రాజకీయాలతో విపక్షాలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో జనంలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు కానీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉండాల్సిన రీతిలో వైసీపీ సర్కార్ పాలన లేదు. స్వయంగా అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న సీఎం జగన్.. ఇప్పుడు తన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఏకంగా న్యాయవ్యవస్ధలో కీలకమైన న్యాయమూర్తులనే టార్గెట్ చేశారు. ఈ పరిణామాలపై జనం ఏమనుకుంటున్నారో తెలియాలంటే మున్సిపోల్స్ ఫలితాలే కీలకంగా మారాయి.

మూడు రాజధానులకు రిఫరెండంగా
వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించి ఏడాది దాటిపోయింది. అయినా అందులో ఎలాంటి పురోగతి లేదు. ముఖ్యంగా రాజధానుల లాంటి అందరితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోవడమే కాకుండా దాన్ని సమర్ధించుకునేందుకు వైసీపీ సర్కారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం న్యాయవివాదాల్లో నలుగుతున్న రాజధానుల ప్రక్రియ ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలియదు. ఈ ఏడాది కూడా రాజధాని తరలింపు సాధ్యం కాదని తేలిపోతోంది. దీంతో రాజధానులుగా ప్రకటించిన విజయవాడ, విశాఖ, కర్నూలు కార్పోరేషన్ ఎన్నికలు వైసీపీ సర్కారుకు సవాల్‌గా మారిపోయాయి.

విజయవాడ, గుంటూరు, విశాఖలో వైసీపీ ఎదురీత ?
మూడు రాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడ, గుంటూరుల్లో వైసీపీకి వ్యతిరేకత బాగా పెరిగింది. ఏడాది కాలంగా మూడు రాజధానుల సమర్ధనలో భాగంగా మంత్రులు చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. రాజధాని వచ్చినట్లే వచ్చి తరలిపోతోందన్న బాధ విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల ప్రజల్లో, విద్యావంతుల్లో కనిపిస్తోంది. అయితే ఈ వ్యతిరేకత అమరావతి దాటదని భావించిన సర్కారుకు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం మరో తలనొప్పిగా మారింది. ప్రకటించిన రాజధాని రాకపోగా.. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని పరిస్ధితుల్లో విశాఖలో వైసీపీ దోషిగా మారిపోయింది. దీంతో స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఎక్కడ తమ కొంప ముంచుతుందో అన్న ఆందోళన వైసీపీ నేతల్లో పెరిగిపోతోంది.

ప్రత్యక్ష పోరులో నెగ్గక తప్పని పరిస్ధితి
నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ పోరులో పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలు కాస్తా ఈసారి కాస్త ఎక్కువగా పార్టీల రంగు పులుముకున్నాయి. అయితే ఇందులో ఎవరు గెలిచారనే విషయంలో కచ్చితమైన లెక్కలు లేకపోయినా వైసీపీ ఆధిపత్య మాత్రం కనిపించింది. అధికార పార్టీగా వైసీపీకి ఉన్న అనుకూలతలే ఇందుకు కారణం. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పరిస్ధితి ఉండదు. గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో చేసిన రాజకీయాలు పట్టణ, నగర పోరులో రిపీట్ చేయడం అంత సులువు కాదు. అదీ పరోక్ష పోరుగా ఉన్న పంచాయతీ పోరుతో పోలిస్తే ప్రత్యక్షంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తేనే నిలవడం సాధ్యమవుతుంది. లేకపోతే ఆ ప్రభావం నేరుగా ప్రభుత్వంపై పడుతుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.