ఎన్జీవో నేత అశోక్బాబు అనూహ్య వ్యాఖ్యలు...మళ్లీ యు టర్నా?
కడప: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు నోటి వెంట అనూహ్యమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం. పోరాటాల్లో పాల్గోవడం చేస్తున్న ఆయన హఠాత్తుగా పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనా ఉద్యమం పూర్తిగా రాజకీయం అయిందని, ఎవరికి వారు ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి పదేళ్లు హోదా కావాలని ఎవరు అడగలేదని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ పలు సార్లు స్పష్టం చేసినప్పటికీ ఇంకా ఉద్యమాలు చేయడం వృధా అని, ఇలాంటి ఉద్యమాల వల్ల ప్రజలు నష్టపోతారని అశోక్ బాబు అన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఉద్యోగులు పోరాడితే వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. రాష్ట్రాన్ని విభజన చేయమని లేఖలు ఇచ్చిన పార్టీలే నేడు హోదా కోసం పోరాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడిన సమయంలో ఇలా పోరాటాలు, ఉద్యమాలు చేయడం సబబు కాదంటూ అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వ్యాఖ్యలపై ఉద్యోగ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.ఈ నెల 20 న సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించిన అశోక్ బాబు...నాలుగు రోజులు వ్యవధిలో అందుకు భిన్నంగా మాట్లాడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
అశోక్ బాబు ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నారేమోననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే అశోక్ బాబు వైఖరిలో హఠాత్తుగా మార్పు రావడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని ఉద్యోగ వర్గాలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నాయి.