ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలంటూ ఎన్నికల సంఘం, వద్దంటూ ప్రభుత్వం వరుస ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రారంభం కావాల్సిన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదు. ఏకంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు నిర్వహించాల్సిన ఎంపీడీవో కార్యాలయాలకు అధికారులు తాళాలు తీయకపోవడం ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టు తీర్పు రాబోతున్నందున అప్పటివరకూ వేచి చూద్దామనే ధోరణిలో రిటర్నింగ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. తన కార్యాలయంలోనే ఉన్న నిమ్మగడ్డ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

మొదలుకాని నామినేషన్ల ప్రక్రియ
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తారా స్దాయికి చేరుకుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పాటించాలా, ప్రభుత్వం మనసెరిగి వ్యవహరించాలా అన్న విషయంలో అధికారులు చివరికి ప్రభుత్వంవైపే మొగ్గారు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభం కావాల్సిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాలేదు. ఏ జిల్లాలోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్ధులు నిరాశ చెందాల్సిన పరిస్ధితి.

ఆదేశాలు పట్టించుకోని కలెక్టర్లు
ఇవాళ ఎట్టిపరిస్ధితుల్లోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఎస్ఈసీ హోదాలో కలెక్టర్లకు నిమ్మగడ్డ దాఖలు చేశారు. ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయినా ఇప్పటికీ పలు జిల్లాల్లో కనీసం ఆఫీసులకు తాళాలు కూడా తీయని పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో అధికారులు ఎస్ఈసీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని అర్ధమైపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవాళే వచ్చే అవకాశం ఉండటంతో ఆలోపు ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేసే ప్రభుత్వం ఆగ్రహానికి గురికావడం ఎందుకని కలెక్టర్లు మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.

సుప్రీం తీర్పు కోసం ఎదురుచూస్తున్న నిమ్మగడ్డ
తాను జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కావాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు పంపినా వారు పట్టించుకోకపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ నిస్సహాయంగా ఎదురుచూస్తున్న పరిస్ధితి నెలకొంది. శనివారం ఆఫీసు వేళలు ముగిశాక హైదరాబాద్లోని ఇంటికి వెళ్లిపోయిన నిమ్మగడ్డ ఇవాళ ఉదయం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చారు. అయితే అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుందని తెలిసినా ఆయన కూడా సుప్రీంకోర్టు ఆదేశాల కోసం తప్పనిసరిగా ఎదురుచూడాల్సిన పరిస్దితి తలెత్తింది. దీంతో తాజా పరిస్ధితిని నిశితంగా గమనిస్తున్నారు. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నట్లు తెలుస్తోంది.