ఏపీ పంచాయితీ పోరు : గ్రామ వాలంటీర్లను టార్గెట్ చేస్తూ , తెర మీదకు కొత్త డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీంతో ఇవ్వాళ్టి నుంచే తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న దాడులు, కిడ్నాప్‌లు, హింసాత్మక ఘటనల అనుభవాల దృష్ట్యా ఈసారి జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కొత్త డిమాండ్స్ తెరమీదకు వచ్చాయి.
ముఖ్యంగా టిడిపి నాయకులు గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జరగనున్న పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ అప్రజాస్వామిక హింసాత్మక విధానాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నామని పలు అంశాలను ప్రస్తావించారు.

నామినేషన్ల ప్రక్ర్రియ ఆన్ లైన్ లో కొనసాగేలా చూడాలని టీడీపీ విజ్ఞప్తి
ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాసిన లేఖలో పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎన్నికల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా గతంలో అడ్డుకున్న కారణంగా నామినేషన్ల ప్రక్రియ ను ఆన్లైన్లో వేసేలా చూడాలని వర్ల రామయ్య విజ్ఞప్తిచేశారు. ఈ విధానం వల్ల కొంతమేర శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడొచ్చన్న అభిప్రాయం వర్ల రామయ్య వ్యక్తం చేశారు.

గ్రామ వాలంటీర్లను ఎన్నికల ప్రకరియకు దూరం పెట్టాలి
అంతేకాకుండా గ్రామ వాలంటీర్ల ను ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంచాలని, గ్రామ వాలంటీర్లను అధికార వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం వాడటమే కాకుండా, వారి ద్వారా అక్రమాలకూ పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రులు ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘించారని, ఓ వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టిడిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వర్ల రామయ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు.

కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు , ఎన్నికల అధికారుల విషయంలో కూడా ..
ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలను రంగంలోకి దించి ఎన్నికల పర్యవేక్షణ కొనసాగించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పై అక్రమ కేసులు బనాయించి, నేరారోపణ చేసి అనర్హులను చేయాలనే ఉద్దేశంతో నెంబర్ 2/2020లో తీసుకొచ్చారని మళ్లీ 2020 ఆగస్టు 4న డిజైన్స్ నెంబర్ 6ను తిరిగి పునరుద్ధరించారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఓటర్ లిస్ట్ ను అధికార పార్టీ అభ్యర్థులకు మరో ఓటర్ లిస్టు ఇచ్చి అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.

విధుల్లో ఉండే సిబ్బంది అదే డివిజన్ సిబ్బంది అయితే ఇబ్బంది
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల అధికారులకు విధులు నిర్వహించే సిబ్బందికి వారు పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్ లో విధుల్లో నియమించకుండా ఇతర డివిజన్లలో డ్యూటీలు వేయాలని కోరారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు . అధికార వైసీపీ పార్టీ జెండా రంగుల అంశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను విజ్ఞప్తి చేశారు.