కీలక భేటీ: గవర్నర్‌తో నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం: 15 నిమిషాల తేడాతో
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వానికి సంబంధించిన తొలి ప్రక్రియ ఇక ఆరంభం కాబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేసిన తరువాత.. చోటు చేసుకుంటోన్న పరిణామాలన్నీ చకచకా సాగిపోతోన్నాయి. పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగబోతోన్నందున.. అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం చేయడానికి జగన్ సర్కార్ కసరత్తును పూర్తి చేసింది. ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా నజరానాలను ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
నిమ్మగడ్డ వాళ్లకు మాత్రమే సొంతం: వదిలేస్తే బెటర్: అప్పుడే ఆయనపై విశ్వసనీయత: మాజీ సీఎస్'

15 నిమిషాల తేడాతో భేటీ..
ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. కాస్సేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కాబోతోన్నారు. 15 నిమిషాల తేడాతో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ఉదయం 10:15 నిమిషాలకు తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్.. 10:30 గంటలకు ఆదిత్యనాథ్ దాస్.. గవర్నర్‌తో భేటీ కాబోతోన్నారు. ఈ మేరకు వారిద్దరికి రాజ్‌భవన్ అధికారులు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

రీషెడ్యూల్‌తో పాటు..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన తరువాత.. సంభవించిన పరిణామాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ, రీషెడ్యూల్ నోటిఫికేషన్ ప్రతులను ఆయన గవర్నర్‌కు అందజేస్తారని సమాచారం. రీషెడ్యూల్ చేయడానికి గల కారణాలను వివరిస్తారని చెబుతున్నారు. అలాగే- ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సహకారం అందుతోందనే విషయాన్ని గవర్నర్‌కు వివరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

ఎన్నికల జాబితా సవరణపై
ప్రత్యేకించి- 2019 నాటి ఎన్నికల జాబితాతోనే ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలు, అందుకు దారి తీసిన పరిణామాల గురించి నిమ్మగడ్డ.. గవర్నర్‌కు క్షుణ్నంగా వివరిస్తారని అంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయొచ్చని చెబుతున్నారు. ఎన్నికల జాబితాను సన్నద్ధం చేయకపోవడానికి ఈ ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులే కారణమంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ వాదన గవర్నర్ దృష్టికి..
కాగా- ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సవరించకపోవడానికి గల కారణాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. గవర్నర్‌కు వివరిస్తారని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వం భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అంశాన్ని ఆయన గవర్నర్ ముందు ప్రస్తావిస్తారని, ఓటర్ల జాబితాను సవరించకపోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సహకారం అందిందా? లేదా? అనే విషయాన్ని గవర్నర్‌కు దృష్టికి తీసుకెళ్లొచ్చని చెబుతున్నారు. ఈ భేటీ తరువాత ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.