పంచాయితీ వార్ : నిమ్మగడ్డకు సహాయనిరాకరణ , ఈసారి ఏపీ పోలీస్ అధికారుల వంతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయినా సరే ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని పట్టిన పట్టు విడవకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడుగులు వేస్తున్నారు.
ఇక సుప్రీం కోర్టులో కేసు ఉన్నందున నోటిఫికేషన్ విడుదల చేయడం తప్పని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పిచ్చి పీక్స్ కి, ఏ అధికారి పని చెయ్యరు : ఎస్ఈసీకి వైసీపీ మంత్రుల కౌంటర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి పునరాలోచించాలి : ఏపీ పోలీస్ అధికారుల సంఘం
ఇదే సమయంలో ఎన్నికల విధులను చెయ్యలేమని, తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఏపీ పోలీస్ అధికారుల సంఘం కూడా ఎన్నికలపై విముఖతను వ్యక్తం చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సహాయనిరాకరణ కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా ఉన్నతాధికారులు సైతం హాజరు కాని పరిస్థితి నెలకొంది.

పోలీస్ శాఖలో కరోనా కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయారు
ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వర్తించ లేమని చెప్పడంతో సహాయ నిరాకరణ మొదలైందని ఇట్టే అర్థమవుతుంది. ఇక తాజాగా తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోమారు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
పోలీస్ శాఖలో ఇప్పటివరకు కరోనా కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయారు అని, 14 వేల మంది కరోనా బారిన పడ్డారని పేర్కొన్న ఆయన ఎన్నికల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని, ప్రాణాల మీదకు రిస్కు తీసుకోలేమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు .

పోలీస్ శాఖ లో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ , ఆ తర్వాతే ఎన్నికలు
పోలీస్ శాఖ లో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సమయంలో బందోబస్తు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందంటూ పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని దీనిని పరిగణలోకి తీసుకోవాలని నిమ్మగడ్డ కు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు అవసరమే కానీ కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుంది అంటూ తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు పోలీస్ అధికారుల సంఘం నేతలు.

ఎస్ఈసీకి చేతులెత్తి వేడుకుంటున్నాం, ఎన్నికలు వాయిదా వెయ్యండి
ఎస్ఈసీకి చేతులెత్తి వేడుకుంటున్నాం, ఇప్పటికే పోలీసు శాఖలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని , ప్రజలకు నిరంతరం సేవ చేసే పోలీసుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని కొంతకాలం ఎన్నికలను వాయిదా వేయాలని పోలీసులు కోరుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో పోలీసులు సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరు అనేది స్పష్టమౌతుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ప్రతికూల పరిస్థితుల్లో, ప్రభుత్వం , ప్రభుత్వ ఉద్యోగులు సహాయనిరాకరణ కొనసాగిస్తున్న సమయంలో ఎన్నికలను నిర్వహించడం నిమ్మగడ్డ రమేష్ కు కత్తి మీద సామే. మరి ఎన్నికల నిర్వహణ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.