పరిషత్ పోలింగ్ షురూ -భారీ భద్రత -47శాతం కేంద్రాలు సమస్యాత్మకం -కౌంటింగ్ వద్దన్న కోర్టు
ఆంధ్రప్రదేశ్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిపి మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 2,44,71,002 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
ఏపీలో పరిషత్ ఎన్నికల కోసం ఎస్ఈసీ సకల ఏర్పాట్లు చేసింది. కాగా, మొత్తం 27,751 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు సగం సమస్యాత్మక కేంద్రాలే కావడం గమనార్హం. 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 47.03% పోలింగ్ కేంద్రాల్లోనూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ నిలిపివేసి బ్యాలెట్ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. 1,72,787 మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందించనున్నారు. పోలింగ్ అబ్జర్వేషన్ కోసం 1,972 మంది జోనల్ అధికారులు, 6,524 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో విధిగా కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు. ఓటర్లు మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన ఓటర్లయితే పీపీఈ కిట్లు అందించి వారికి పోలింగ్ చివరి గంటలో ఓటేయడానికి అనుమతిస్తారు.
ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళ
పోలింగ్ జరుగుతున్న తీరును తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ విధానంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.
పోలింగ్ పూర్తి చేసినా ఓట్లు లెక్కించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు బ్యాలెట్ బాక్సులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.