
ఏపీలో పెగాసస్ ట్విస్టులు-సభలో చర్చ వద్దన్న టీడీపీ-గుట్టు బయటపెట్టబోతున్న ఏబీ?
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన పెగాసస్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్ని కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేస్తుండగా.. టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీలో చర్చకు వైసీపీ సిద్ధమైంది. అయితే దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు పెగాసస్ వివాదంపై గుట్టు బయటపెట్టేందుకు మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధమవుతున్నారు.

ఏపీలో పెగాసస్ రచ్చ
ఏపీలో పెగాసస్ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. మమతా బెనర్జీ చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనుగోళ్లు చేశారంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ తమపై చేస్తున్న దాడికి టీడీపీ కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఈ వివాదంలో చేరిపోయారు.
టీడీపీ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదంటూ ఆయన సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరణ ఇప్పుడు కీలకంగా మారిపోయింది. అదే సమయంలో గతంలో ఇంటెలిజెన్శ్ ఛీఫ్ గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కొన్నారని చెప్తున్న పెగాసస్ స్పైవేర్ ఆరోపణల గుట్టు బయటపెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

అసెంబ్లీ చర్చకు వైసీపీ రెడీ
పెగాసస్ వివాదంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇచ్చిన అస్త్రాన్ని వాడుకోవడంలో వైసీపీ విఫలమైందన్న ప్రచారం నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. పెగాసస్ వివాదాన్ని ఇవాళ అసెంబ్లీలో లేవనెత్తిన విద్యామంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రభుత్వం దీనిపై చర్చించాలని కోరారు.
ఆ తర్వాత ప్రభుత్వం కోరిక మేరకు దీనిపై స్వల్పకాలిక చర్చకు స్పీకర్ తమ్మినేని అనుమతి కూడా ఇచ్చారు. అయితే ఈ మధ్యలోనే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ రచ్చ చేయడంతో స్పీకర్ మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ లేకుండానే పెగాసస్ చర్చ జరగబోతోంది.

పెగాసస్ చర్చను వ్యతిరేకిస్తున్న టీడీపీ
పెగాసస్ వివాదంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ అనూహ్యంగా వ్యతిరేకిస్తోంది. పెగాసస్ వివాదంపై మమత చేసిన ఆరోపణలతో పాటు వైసీపీ విమర్శలకు కూడా ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్న టీడీపీ.. అసెంబ్లీలో మాత్రం చర్చను వ్యతిరేకించింది.
ఈ మేరకు స్పీకర్ తమ్మినేనికి లేఖ రాసింది. గతంలో పార్లమెంటులో పెగాసస్ చర్చ వద్దంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరడాన్ని స్పీకర్ కు రాసిన లేఖలో టీడీపీ గుర్తుచేసింది. తద్వారా కోర్టుల్లో ఉన్న వ్యవహారంపై చట్టసభల్లో చర్చించవద్దంటూ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం చర్చకే మొగ్గు చూపుతోంది. తద్వారా చంద్రబాబును కార్నర్ చేయొచ్చని భావిస్తోంది.

గుట్టు బయటపెట్టబోతున్న ఏబీ?
మరోవైపు టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నప్పుడు వైసీపీపై గూఢచర్యంకోసం ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొన్నారని ఆరోపణలు ఎధుర్కొంటున్న ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని కేంద్రం కూడా సమర్ధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెగాసస్ చర్చ తెరపైకి వచ్చింది.
దీంతో ఏబీ వెంకటేశ్వరరావు ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి పెగాసస్ వివరాలు వెల్లడించబోతున్నారు. ఏబీ బయటపెట్టే వివరాలలతో పెగాసస్ కొన్నారా లేదా అనే దానిపై పూర్తి క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.