అయ్యన్నపాత్రుడికి పోలీసు అధికారుల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్-సంకనాకుడు వ్యాఖ్యలపై
ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులో భాగంగా ఇప్పటికే తీవ్ర పదజాలంతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో నిన్న విశాఖలో తన ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. పోలీసులు అసెంబ్లీలో చంద్రబాబును అవమానించిన వారి సంకనాకుతున్నారని ఆరోపించారు. దీనిపై ఇవాళ ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది.
రాజ్యాంగ వ్యవస్ధలపై తిరుగుబాటు చేయాలంటూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ పిలుపు ఇచ్చిన అయన్నపాత్రుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల్ని ఉద్దేశించి అవమానకరంగా, కించపరిచేలా, అభ్యంతరకరమైన భాషలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మాజీ మంత్రి అయిన అయన్న వ్యాఖ్యలతో మూడు సింహాలు తలదించుకుంటున్నాయని సంఘం నేతలు తెలిపారు.

అసెంబ్లీలో ఘటనలకు ఎవరు స్పందించాలో, ఎవరు బాధ్యత వహించాలో కూడా అవగాహన లేని వ్యక్తులు గతంలో మంత్రిగా పనిచేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని పోలీసు అధికారుల సంఘం నేతలు విమర్శించారు. గతంలో మహిళా హోంమంత్రి, ఐపీఎస్ లపై చేసిన వ్యాఖ్యలు మహిళలపై, అధికారులపై, రాజ్యాంగ వ్యవస్ధలపై మర్యాద లేదన్న విషయం స్పష్టం చేస్తున్నాయని వారు తెలిపారు. గతంలో ఎవరి సంకనాకారని మిమ్నల్ని ప్రజలు తిరస్కరించారో తెలుసుకోవాలని ఆయన్ను కోరారు. ప్రజాసేవలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పోలీసుల సంకనాకడం మీకు అలవాటుగా మారిపోయిందన్నారు.
పోలీసులు ఏం పీకుతున్నారో ఇటీవలి వరదల్లో సహాయకచర్యల్ని చూస్తే తెలుస్తుందన్నారు. పోలిసుల్ని బట్టలూడదీసి కొట్టండన్న అయ్యన్నవ్యాఖ్యలు ఆయన పిరికితనానికి, అసమర్ధతకు, చేతకానితనానికి నిదర్శమని పోలీసు అధికారుల సంఘం తెలిపింది. నీ నియోజకవర్గ ప్రజలు గతంలో బ్యాలెట్ ద్వారా మీకు బట్టలూడదీసిన విషయం గుర్తుంచుకోవాలని కోరింది. ఇటీవల ఇండియన్ పోలీసు ఫౌండేషన్ సర్వేలో ఏపీ పోలీసులు సాధించిన ఘనత తెలుసుకుని ఇప్పటికైనా బహిరంగ క్షమాపణలు చెప్పాలని అయ్యన్నను పోలీసు అధికారుల సంఘం కోరింది. నీ రాజకీయ లబ్ది కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం కుట్రలకు పాల్పడుతూ మరోసారి పోలీసు వ్యవస్ధపై అవాకులు చవాకులు పేలితే ఖబడ్డార్ అని హెచ్చరించింది.