వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజాపై తెలంగాణలో కేసు: ఎపి మత్రి పీతల సుజాతతో ఢీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు, అధికార తెలుగుదేశం పార్టీ మధ్య వివాదాలతో శాసనసభ అట్టుడికిన విషయం తెలిసిందే. తమ పార్టీకి చెందిన 8 మంది శానససభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా సమావేశాలను బహిష్కరించింది. అయితే, ఆ వేడి చల్లారలేదు. ఆ రాజకీయ వేడి మంత్రి పీతల సుజాత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా మధ్య సమరంగా మారింది.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజాపై హైదరాబాదులోని సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో వికలాంగులు ఫిర్యాదు చేశారు. ఏపీ అసెంబ్లీలో వికలాంగులను కించపరిచేలా రోజా వ్యాఖ్యానించారని వికలాంగులు ఫిర్యాదులో ఆరోపించారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రోజాపై చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.

ఇదిలావుంటే, సోమవారంనాడు పీతల సుజాత, రోజా పరస్పరం మాటల ఈటెలు రువ్వుకున్నారు. పీతల సుజాత రోజా ఆరోపణలపై స్పందిస్తూ కంటతడి కూడా పెట్టుకున్నారు. శాసన సభలో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షంపై అధికార టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనను లక్ష్యం చేసుకున్నారని రోజా ఆరోపించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే కరెక్ట్.. మేం మాత్రం ఆడవాళ్లమంటూ చీర కప్పుకొని వెళ్లాలంటా.. ఇదేమీ అన్యాయమని ఆమె ప్రశ్నించారు. తాను 150 చిత్రాల్లో నటించానని కూడా ఆమె గుర్తు చేశారు.

కళాకారిణి అయిన తనను అవమానిస్తే ఎన్టీఆర్, బాలకృష్ణలను కూడా అవమానించినట్లేనని ఆమె చెప్పారు. కళాకారుడు పెట్టిన పార్టీలో పుట్టి తన పైన వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాలకృష్ణ కూడా నటుడేనని, ఓ ఆర్టిస్ట్ గురించి అలా మాట్లాడుతుంటే స్పీకర్ ఖండించకపోగా హోల్డ్ యువర్ టంగ్ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

AP politics: Fight between Roja and Peethala Sujatha

రోజా రెడ్డి ఓ దళిత మంత్రి పైన ఆరోపణలు చేస్తుంటే జగన్ రెడ్డి అడ్డుకోలేదని, అదే దళితుల పైన ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేస్తోందని పీతల సుజాత అన్నారు నీతి, నిజాయితీలకు మారుపేరు దళితులు అన్నారు. రోజా రెడ్డి అగ్రకుల దురహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. తన పైన వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. పార్టీ తరఫున ఏదో మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లుగా నోరు జారొద్దన్నారు. తాను ఎప్పుడు అహంభావంతో మాట్లాడలేదన్నారు.

తాను లావుగా ఉన్నానని రోజా అంటున్నారని, ఆమె మాత్రం సన్నగా ఉందా అని ఎద్దేవా చేశారు. తాను ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడలేదన్నారు. తన పైన చేసిన ఆరోపణలు రోజా నిరూపించాలని లేదంటే అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

రోజాపై మార్కెట్లో క్యాసెట్లు హల్ చల్ చేస్తున్నాయని, వాటిపై ఆమె ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అవినీతి మంత్రంటూ తనపై ఎమ్మెల్యే రోజారెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలు కనుక నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. పేద కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చానని, నీతి నియమాలు, సంస్కారంతో పెరిగానని మంత్రి చెప్పారు. రోజా మాదిరిగా అసభ్యంగా మాట్లాడటం తనకు చేతకాదని, ఆమె మాట్లాడుతున్న మాటలు వింటే మతి పోతోందని, మన సమాజం ఎటు పోతుందో అని భయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు అవకాశం ఇస్తే పీతల సుజాతపై తాను చేసిన ఆరోపణలను రుజువు చేస్తానని రోజా అన్నారు. తనను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. పీతల సుజాతకు వడ్డాణం బహుమతి ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు ఫిర్యాదులు అందాయని గతంలో ఓ ఆంగ్లదిన పత్రికలో వార్తాకథనం వచ్చిన విషయాన్ని రోజా ఇటీవల గుర్తు చేశారు.

చంద్రబాబు కాలిగోటికి కూడా సరిపోవు అని తనను అన్నప్పుడు తాను వ్యాఖ్యలు చేశానని ఆయన అన్నారు. తనకు బుర్ర ఉందో లేదో ప్రజలు చెబుతారని ఆమె అన్నారు. పీతల సుజాత ఓ వైపు, రోజా మరో వైపు ఉండి రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X