స్తబ్ధుగా ఏపీ రాజకీయం-జగన్ సర్కార్ పై వ్యతిరేకత-సొమ్ముచేసుకోలేని స్దితిలో విపక్షాలు
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎప్పుడూ లేనంత స్తబ్ధత కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా దాన్ని సొమ్ము చేసుకోలేక విపక్షాలు చతికిల పడుతున్న పరిస్ధితులే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. వైసీపీ సర్కార్ సగం పదవీకాలం పూర్తి చేసుకుంది. మరో ఏడాది దాటితే ఎన్నికల వాతావరణం కూడా వచ్చేస్తుంది. కానీ ఎన్నికలకు విపక్షాలు ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నాయంటే మాత్రం జవాబు లేదు. దీనికి భిన్నంగా వైసీపీ రోజురోజుకీ బలపడుతోంది.

ఏపీ రాజకీయాల్లో స్తబ్ధత
ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ లేనంత దారుణమైన స్తబ్ధత కనిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా స్పందించాల్సిన అంశాలున్నా, అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నా, దాన్ని అందిపుచ్చుకోలేని పరిస్ధితుల్లో విపక్షాలు ఉండిపోతుండటమే ఇందుకు కారణం. అన్నింటికంటే మించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బలమైన రాజకీయ అజెండాను సిద్ధం చేసుకోవడంలో విపక్షాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చిన ఇబ్బేందేమీ లేదనేలా పరిస్ధితులు మారిపోతున్నాయి.

రాజకీయ అజెండా కరవు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని ఇరుకునపెట్టాలన్నా, దాని స్ధానంలో అధికారం చేపట్టాలన్నా బలమైన రాజకీయ అజెండా అవసరం. ఇప్పుడు అలాంటి రాజకీయ అజెండా విపక్షాల వద్ద ఉన్నట్లు కనిపించడం లేదు. తాజాగా అమరావతి విషయంలో విపక్షాలు ఏకమైనా అది రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసే స్ధితిలో లేదు. దీంతో అమరావతి తోక పట్టుకుని రాష్ట్ర రాజకీయాన్ని ఈదేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ అజెండాల కోసం విపక్షాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఐక్యత మరో సమస్య
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను అందరూ తప్పుబట్టే వారే. కానీ కలిసి పనిచేసేందుకు మాత్రం ఏ రెండు పార్టీలు సిద్ధంగా లేని పరిస్ధితి. కేవలం అమరావతి విషయంలో మాత్రం టీడీపీ, సీపీఐ కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా అదెంత కాలమో చెప్పలేని పరిస్ధితి. స్వతహాగా మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ కూడా ఉమ్మడి పోరాటాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగని అటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ టీడీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధ పడటం లేదు. రాష్ట్రంలో ఉమ్మడిగా పోరాడాల్సిన అంశాలు ఎక్కువగానే ఉన్నా వాటిపై పోరాటాలు మాత్రం ఉమ్మడిగా చేపట్టేందుకు వీరిలో ఎవరూ సిద్ధంగా లేరు. దీనికి కారణం ఎవరి అజెండాలు వారికి ఉండటమే.

విపక్షమే జగన్ బలం
ఏపీలో విపక్ష పార్టీలకు ప్రస్తుతం బలమైన రాజకీయ అజెండా లేదు. అలా అని ఉమ్మడిగా పోరాటాలు చేసి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే లౌక్యం కూడా కనిపించడం లేదు. చివరికి పొత్తులు కుదుర్చుకునేందుకు ముందుకొచ్చే పరిస్దితులు కూడా లేవు. దీంతో ఇప్పటికిప్పుుడ ఎన్నికలు జరిగినా, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఇదే వైఎస్ జగన్ కు కలిసొచ్చేలా కనిపిస్తోంది. విపక్షాలు ఉమ్మడిగా దాడి చేయాలన్నా పటిష్టమైన వ్యూహం, రాజకీయ అజెండా అవసరం. ప్రస్తుతం అలాంటి అవకాశం లేదు. చివరికి వారికి ఏ చిన్న అవకాశం కూడా లేకుండా కేవలం విమర్శలకే పరిమితమయ్యేలా జగన్ వ్యూహరచన సాగుతోంది. దీంతో విపక్షాల వైఫల్యాలనే తన బలంగా మార్చుకుంటూ జగన్ ముందుకు సాగిపోతున్నారు.