మంత్రుల కమిటీకి మళ్లీ నిరాశ-చర్చలకు వెళ్లని ఉద్యోగ నేతలు-ఆ జీవోలు రద్దయితేనే
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో చర్చల కోసం ప్రభుత్వం నియమించిన కమిటీకి ఇవాళ రెండో రోజు కూడా ఎదురుచూపులు తప్పలేదు. ఓవైపు ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించగా... వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. మంత్రులతో చర్చలకు వెళ్లాలా వద్దా అన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు ఇవాళ మంత్రుల కమిటీ నుంచి మరోసారి పిలుపువచ్చింది. నిన్న దాదాపు నాలుగు గంటల పాటు ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురుచూసిన మంత్రుల కమిటీ.. కనీసం ఇవాళ అయినా చర్చలకు రావాలని కోరింది. అయితే విజయవాడలో సమావేశమైన ఉద్యోగసంఘాల నేతలు మాత్రం చర్చలకు వెళ్లేందుకు మొగ్గు చూపలేదు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలు ఉపసంహరించుకోకుండా చర్చలకు వెళితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన నేతలు.. వెనక్కి తగ్గారు. అయితే పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలంటూ మంత్రుల కమిటీకి లేఖ రాయాలని వారు నిర్ణయించారు.

పీఆర్సీ జీవోలు రద్దు చేయకుండా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఉద్యోగసంఘాల నేతలు చెప్తున్నారు. ఇదే అంశాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రుల కమిటీకి లేఖ రాయబోతున్నారు. మరోవైపు పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ధర్నాచౌక్ ల వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసు మేరకు ప్రభుత్వం పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోకుంటే వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.