సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ- ఎన్నికల కోడ్ గుర్తుచేస్తూ- టార్గెట్ మంత్రులు, సజ్జల
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ అదో విషయాన్ని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దృష్టికి తీసుకెళ్లారు. కోడ్ అమల్లో ఉండగా చేయకూడని పనులను మరోసారి సీఎస్‌కు ఆయన గుర్తుచేశారు. తద్వారా వారిని నియంత్రించాలని నిమ్మగడ్డ కోరారు.
ఏపీలో ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ మరో లేఖ రాశారు. ఇందులో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను గుర్తు చేస్తూ పలు అంశాలను ఎస్ఈసీ ప్రస్తావించారు. గ్రామాలకు మంత్రులు వెళ్తే ఎన్నికల ప్రచారంగా పరిగణిస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. మంత్రులతో పాటు గ్రామాలకు అధికారులు వెళ్లరాదని నిమ్మగ్డడ సూచించారు. అలాగే
ప్రచారానికి వెళ్లే మంత్రులు అధికారిక వాహనాలు వాడరాదని ఎస్ఈసీ సూచన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంతో కలిపి నిర్వహించరాదని మంత్రులకు మరో సూచన చేశారు. అభ్యర్ధులకు మద్దతుగా మంత్రులు ఎలాంటి అధికారాలూ వాడరాదన్నారు.

మరోవైపు ప్రభుత్వ సలహాదారుల విషయంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ పలు విషయాలను సీఎస్ దృష్టికి తెచ్చారు. ఇందులో ప్రధానంగాప్రభుత్వ సలహాదారులు సర్కారీ వాహనాల్లో పార్టీ ఆఫీసులకు వెళ్లరాదని ఎస్ఈసీ తెలిపారు. సలహాదారుల పార్టీ ఆపీసుల్లో పెట్టే ప్రెస్మీట్లు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ గుర్తుచేశారు. తద్వారా ఆయన జగన్ సలహాదారు సజ్జల నిత్యం తనపై చేస్తున్న విమర్శలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లయింది.