andhra pradesh nimmagadda ramesh kumar press meet success ap govt నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవంతం ఏపీ ప్రభుత్వం
ఏపీలో పంచాయతీ పోరు సక్సెస్- మారిన లెక్కలు- జగన్ స్ధానంలో చంద్రబాబు
ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, ఉద్యోగ సంఘాల సహాయనిరాకరణ, ప్రభుత్వ పెద్దల విమర్శల మధ్య ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్న దాని కంటే మెరుగ్గానే ఈ పోరును ముగించారు. నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో నిమ్మగడ్డ ఇప్పుడు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఆన్నీ తానే అయి వ్యవహరించిన నిమ్మగడ్డ తనకున్న అనుభవంతో ఏకంగా ప్రభుత్వంతోనే ముఖాముఖీ పోరు నడిపి మరీ విజయవంతం అయ్యారు. దీంతో ఈ విజయం ప్రజాస్వామ్య విజయమే కాదు నిమ్మగడ్డ సాధించిన వ్యక్తిగత విజయంగానూ నిలిచింది.

ఏపీలో ముగిసిన పంచాయతీ
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంటే ఎన్నికలు ఏంటని ప్రశ్నిస్తూ వైసీపీ సర్కారు పదే పదే కోర్టులను ఆశ్రయించి చికాకు పెడుతున్న తరుణంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి కీలక ఆదేశాలు తెచ్చుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు పోరును అందరి అంచనాల కంటే మిన్నగా ముగించారు. నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో అక్కడక్కడా అవాంఛనీయ ఘటనలు మినహాయిస్తే అంతా ప్రశాంతంగా సాగిపోయింది. దీంతో అరకొర విమర్శలను పక్కనబెడితే పంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన క్రెడిట్‌ను నిమ్మగడ్డ కొట్టేశారు.

కేవలం 16 శాతమే ఏకగ్రీవం
రాష్ట్రవ్యాప్తంగా 13097 స్ధానాలకు పంచాయతీ ఎన్నికలు జరిగితే ఇందులో కేవలం 16 శాతం మాత్రమే ఏకగ్రీవమయ్యాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, భారీ ప్రచారం చేసి, ప్రోత్సాహకాలు ఆశచూపినప్పటికీ కేవలం 16 శాతం స్ధానాలే ఏకగ్రీవం చేయగలిగారు. దీంతో 10,890 మంది సర్పంచ్‌లు పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇందులో 50 శాతం మంది మహిళలు, బలహీన వర్గాల
వారే ఉన్నారు. పోటీ చేసి గెలిచిన వారి వల్లే మెరుగైన నాయకత్వం వ్యవస్ధలకు వస్తుందని ఆశిస్తున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

ఓటింగ్‌తో గెలిచిన ప్రజాస్వామ్యం
భారీగా నమోదైన ఓటింగ్పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో రాజకీయాలు కనిపించినా ఓటర్ల చైతన్యం మాత్రం ప్రతీ చోటా కనిపించింది. అందుకే నాలుగు దశల్లోనూ 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. స్ధానిక సంస్ధలపై ప్రజలకు వి్శ్వాసం కోల్పోతున్న వేళ ఏపీలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టాయి. పోలింగ్ కోసం ఎస్ఈసీ చేసిన ఏర్పాట్లతో పాటు ప్రజల్లో, ఓటర్లలో కల్పించిన విశ్వాసం వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ వెల్లడించారు.

కాదన్న ఉద్యోగులే సహకరించారు
పంచాయతీ ఎన్నికలకు ముందు వ్యాక్సినేషన్ లేకుండా తాము ఎలా పనిచేస్తామని, ఎన్నికల కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టలేమని తేల్చిచెప్పేసిన ఉద్యోగులను దారికి తీసుకురావడంలో కూడా నిమ్మగడ్డ సక్సెస్ అయ్యారు. పోలీసు సిబ్బందితో పాటు ఉద్యోగులు కూడా వ్యాక్సినేషన్‌ను కూడా పక్కనబెట్టి ఎన్నికలకు సహకరించడంపై నిమ్మగడ్డ సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ప్రభుత్వం చెప్పినట్లు విని ఎస్ఈని ధిక్కరించిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పుతో హెచ్చరికలు జారీ చేసినట్లయింది. దీంతో వారంతా ఎస్ఈసీ చెప్పినట్లు విని ఎన్నికలకు సహకరించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిపోయింది.

పంచాయతీ పోరు తర్వాత జగన్ స్ధానంలో చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో తీవ్రంగా విభేధించిన ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ప్రక్రియ మందుకు సాగేకొద్దీ ఎస్ఈసీపై విశ్వాసం కనబరిచారు. అందుకు విరుద్ధంగా ఎస్ఈసీ నిమ్మగడ్డకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న విపక్ష నేత చంద్రబాబు మాత్రం ఎస్ఈసీ పనితీరుపై పెదవి విరిచారు. ఏకంగా నిమ్మగడ్డపైనే ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. చివరికి ఎన్నికలు ముగిసేసరికి వైసీపీ సంతృప్తికరంగా కనిపిస్తుంటే చంద్రబాబు మాత్రం డల్ అయిపోవడం విచిత్రంగా కనిపిస్తోంది.