నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, జగన్ ప్రభుత్వానికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోన్న వివాదంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నతన్యాయస్థానం రిజిస్ట్రీ తిప్పి పంపడంతో పంచాయితీ ఎన్నికల నోటిఫికేష్ ప్రకటన ఖాయంగా మారింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు..

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం

9 మంది అధికారులపై చర్యలు..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రక్రియకు ఆటంకంగా మారొచ్చని భావిస్తోన్న ప్రభుత్వ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. శనివారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏర్పాట్లు చేసుకోగా, జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలు ఎలా ఆపాలనే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష చర్యలకు సిద్ధమైంది. వివిధ జిల్లాలకు చెందిన 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది...

లిస్టులో కలెక్టర్లు, పోలీసులు..
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నో చెబుతుండగా, యంత్రాంగంలో భాగమైన అధికారులు, ఉద్యోగులు సైతం తాము ప్రక్రియలో పాల్గొనబోమని కరాకండిగా చెబుతున్నారు. శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశానికి ఆదేశించినా, అధికారులు హాజరుకాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ నుంచి అధికారులను తొలగిస్తూ ఆయన చర్యలకు ఆదేశించారు. ఆ జాబితాలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. అలాగే, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది. అంతేకాకుండా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖలు రాశారు.

నిమ్మగడ్డ దూకుడు.. అడ్డొస్తే అంతే..
పంచాయితీ ఎన్నికలకు సంబంధించి శనివారం నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దూకుడు పెంచారు. శనివారం వివిధ శాఖల అధికారులతో వరస భేటీలు జరుపుతున్నారు. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తోనూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. అయితే, ఎస్ఈసీతో భేటీకి పంచాయతీరాజ్ అధికారులు రాకపోవడంపై నిమ్మగడ్డ ఫైరయ్యారు. పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ హాజరుకాకపోవడాన్ని నిమ్మగడ్డ సీరియస్‌గా పరిగణిస్తున్నారు. చివరి అవకాశంగా కొంత టైమిచ్చారు. తన ఆదేశాలను బేఖాతరు చేస్తే ఇంకొందరు అధికారులపైనా చర్యలకు ఆదేశించాలని నిమ్మగడ్డ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు..

షెడ్యూల్ ప్రకారమే పంచాయితీ పోల్స్..
ఎస్ఈసీ నిమ్మగడ్డ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో తర్వాత జరుగబోయే పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం సమావేశమయ్యారు. కాగా, ఏపీలో మొత్తం నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ ప్రకటించింది. ఆ షెడ్యూల్ మేరకు.. తొలి దశ నోటిఫికేషన్ శనివారం(23న) విడుదలకానుంది. 27న రెండో దశ, జనవరి 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆమేరకు ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 17తేదీల్లో పోలింగ్ జరుగనుంది. షెడ్యూల్ రిలీజైన జనవరి 8 నుంచే కోడ్ అమల్లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే.
తిరుపతి ఉపఎన్నిక: పవన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం