జగన్ సర్కార్ పై హైకోర్టుకు నిమ్మగడ్డ- ఉత్తర్వులు అమలు కాలేదంటూ ధిక్కార పిటిషన్.....
ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంలో విచారణ అంతకంతకూ ఆలస్యమవుతుండటంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు కోసం నిమ్మగడ్డ తిరిగి న్యాయపోరాటం ప్రారంభించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ ఎన్నికల కమిషనర్ గా తన తొలగింపుకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే వెంటనే తనను తాను నియమించుకుంటూ సర్కులర్ జారీ చేసుకున్న నిమ్మగడ్డకు ప్రభుత్వం ఉత్తర్వుల ఆలస్యంతో షాకిచ్చింది. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వం పాత్ర ఉండబోదంటూ చెప్పడంతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లకుండా పోయే పరిస్ధితి తలెత్తింది.

ఇదే విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం లేవనెత్తడంతో నిమ్మగడ్డ తన సర్క్యులర్ ను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఆశించిన నిమ్మగడ్డ... అది కాస్తా ఆలస్యం అవుతుండే సరికి తిరిగి హైకోర్టు తలుపుతట్టారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని నిమ్మగడ్డ కోరారు.