ముప్పు పొంచి ఉంది- భద్రత పెంచండి : డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ..!!
తనకు ప్రాణహాని ఉందని..తనకు భద్రత కల్పించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాసారు. ఏపీ డీజీపీకి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు పలు అంశాలను ప్రస్తావించారు. తనకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభలో ఆ పార్టీ ఉప నాయకుడిగా ఉన్న తాను.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. అనేక మంది ప్రజలు తనను నిత్యం కలుస్తారని, తానూ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.
సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానని.. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభ పక్ష ఉపనేతగానూ వ్యవహరిస్తున్నందున కోరిన మేరకు భద్రత కల్పించాలన్నారు. దీని పైన పోలీసు అధికారులు అధికారికంగా స్పందించలేదు. కానీ, భద్రత కోరటంతో అచ్చెన్న లేఖ ను సమీక్షించి భద్రతను కేటాయించే అవకాశం ఉంది.

గతంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విషయంలోనూ ఆయన తనను పొట్టన పెట్టుకొనేందుకె రెక్కీ నిర్వహించారంటూ చేసిన ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి. ఆ వెంటనే సీఎం జగన్ ఆదేశాలతో వంగవీటి రాధాకు పోలీసు అధికారులు భద్రత ఏర్పాటు చేసారు. ఇక, ఇప్పుడు అచ్చెన్నాయుడు రాసిన లేఖ పైన పార్టీలోనూ చర్చ సాగుతోంది. ఇక, దీని పైన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.