లాక్ డౌన్ లో సైకిల్ పై కలెక్టర్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యే.... ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులతో పాటు జిల్లాల, పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న సరిహద్దుల్లోనూ పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతుల సమస్యల పరిష్కారం పేరుతో పశ్చిమగోదావరి జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ పై యాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు పేరుతో ఆయన చేపట్టిన యాత్ర ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

లాక్ డౌన్ లో సైకిల్ యాత్ర..
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల దృష్ట్యా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలోని రైతు సమస్యలపై దృష్టిసారించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తన నియోజకవర్గంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నందున కలెక్టర్ కు సమస్యలు విన్నవించాలని భావించారు. కానీ కరోనా సహాయక చర్యల్లో బిజీగా ఉన్న కలెక్టర్ ఫోన్ తీయలేదు. పలుమార్లు ప్రయత్నించి విఫలమైన ఎమ్మెల్యే కమిషనర్ కు ఫోన్ చేశారు. ఆయన కూడా ఫోన్ తీయలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే రామానాయుడు ఈ వ్యవహారంలో అటో ఇటో తేల్చుకోవాలని భావించి సైకిల్ పై పాలకొల్లు నుంచి ఏలూరుకు బయలుదేరారు.

వాహనాలకే ఆంక్షలని భావించి సైకిల్ పై ..
కార్లు, బైక్ లు అయితే పోలీసులు అడ్డగిస్తారని, వాహనాలు సీజ్ చేస్తారని భావించిన ఎమ్మెల్యే రామానాయుడు తన పార్టీ గుర్తు కూడా అయిన సైకిల్ పై యాత్రకు బయలుదేరారు. కానీ మార్గమధ్యలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించి బయటికి రాకూడదని నచ్చజెప్పారు. కానీ తన నియోజకవర్గ రైతు సమస్యలను కలెక్టర్ కు చెప్పుకోవాల్సిందేనని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఎమ్మెల్యే కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక వదిలిపెట్టారు. మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకపోతే.. 106 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ సాయంత్రానికి కలెక్టర్ తో సమావేశం కావాల్సి ఉంది.

ఎమ్మెల్యే డిమాండ్లు ఏమిటంటే..
రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి పాలకొల్లు నుంచి ఏలూరుకు సైకిల్ పై బయలుదేరిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ..
తన నియోజక వర్గ ప్రజలందరినీ తన కుటుంబంగానే భావిస్తున్నానన్నారు.
సమస్యలపై
మాట్లాదామంటే కలెక్టర్ , ఎస్పీ వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్లో అందుబాటులో ఉండటం లేదన్నారు.
ప్రజా ప్రతినిధితో మాట్లాడటం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు అధికారులకు ఏమున్నాయో తనకు తెలియడం లేదన్నారు.
ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలన్నారు.