ఏపీ నుండి తెలంగాణాకు ఆగని గంజాయిదందా.. పెద్ద అంబర్ పేటలో భారీగా గంజాయి పట్టివేత
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తున్న గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణాను పట్టుకోకుండా ఉండేందుకు ఎవరికీ దొరక్కుండా కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. రైళ్లు, బస్సులలో రవాణా చేయడం, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే లారీలలో పంపే ప్రయత్నం చేయడం, ఇక వాహనాలలో ప్రత్యేకమైన సీక్రెట్ లాకర్లను ఏర్పాటు చేయడం వంటి అనేక రహస్య మార్గాలను ఎంచుకుంటున్నారు.
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారించి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గంజాయి దందాకు అడ్డుకట్ట వేయడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నిత్యం గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న ఘటనలే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయి హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్ పేటలో పట్టుబడింది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద హయత్నగర్ పోలీసులు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో ఓ కారులో నుంచి మరో కారులోకి గంజాయి మారుస్తూ ఉండగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 470 కేజీల గంజాయిని, నాలుగు కార్లను, రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడుతున్న గంజాయి దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమ రవాణా చేస్తున్న గంజాయి కావడం గమనార్హం. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ ఉన్నా సరే అక్రమార్కులు, పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు పట్టుబడకుండా వారి కళ్ళుగప్పి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తరలిస్తూ అడ్డంగా పోలీసులకు పట్టుబడుతున్నారు.