వివేకా హత్య..వైఎస్ కుటుంబం: కడప జిల్లా ప్రజలకు మోసం: అందుకే అలా మాట్లాడా
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని దృష్టిలో ఉంచుకుని తాను కడప జిల్లా ప్రజలకు ప్రాణాలను తీయడమే వచ్చు అని వ్యాఖ్యానించానని సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. ఆయనను అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ మాట మాట్లాడానని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా సొంత బాబాయ్‌ను హత్య చేసిన వారిని గుర్తించి, శిక్ష వేయించకుండా కాలక్షేపం చేస్తోందని అన్నారు.

వైఎస్ వివేకాను హత్య చేసిన వారిని..
ఇంత కాలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు పాల్పడిన వారిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడిన మాటలను గుర్తు చేశానని సోము వీర్రాజు చెప్పారు. అంతే తప్ప తాను ఎక్కడా కడప జిల్లా ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదని వివరించారు. వైఎస్ వివేకాను హత్య చేసిన ఆ కొంతమంది వ్యక్తుల మీద వస్తున్న వార్తల ఆధారంగా, వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడానని అన్నారు. ఆ మాటలను తప్పుదోవ పట్టించారని సోము వీర్రాజు ఆరోపించారు.

కడప జిల్లా ప్రజలందరికీ హత్యలను అపాదించినట్లుగా వక్రీకరణ..
ఇలా మొత్తం కడప జిల్లా ప్రజలకు హత్యలను ఆపాదించినట్లు వైసీపీ నాయకులు కావాలని చిత్రీకరిస్తున్నారని, తన మాటలను వక్రీకరించారని ధ్వజమెత్తారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని అన్నారు. కడప జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయత, సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మితే ప్రాణమిచ్చే వారి తెగింపు ఇవన్నీ బాగా తెలిసినవాడినని, ఇందులో కడప జిల్లా ప్రజలకు మరెవరూ సాటిరారని, అది జగమెరిగిన సత్యమని వ్యాఖ్యానించారు.
కడప ప్రజలకు మోసపోవటమే తెలుసు..
అలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ప్రజల గురించి తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడనని, కనీసం అలాంటి ఆలోచన కూడా రాదని చెప్పారు. కడప జిల్లా ప్రజలకు మోసపోవటమే తెలుసు తప్ప, మోసం చేయడం తెలియదని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా, వైఎస్ కుటుంబాన్నిఆదరిస్తూ పదే పదే మోసపోతున్నారు. ఇకనైనా కడప జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబం మాయ నుంచి బయటపడి అభివృద్ధి వైపు పయనించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

కడపను అన్ని విధాలుగా అభివృద్ధి..
కడప జిల్లాకు ఎయిర్ పోర్టుతో పాటు అనేక జాతీయ రహదారులను నిర్మించి, వెనుక బడిన జిల్లా కింద వందల కోట్ల రూపాయల నిధులను ఇచ్చామని సోము వీర్రాజు గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

ఎయిర్‌పోర్టుల సంగతి మేం చూసుకుంటాం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విమానాశ్రయాలను నిర్మిస్తామంటూ చేసిన వ్యాఖ్యల పట్ల విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను స్పందించానని, కనీసం రోడ్డు మీద ఉన్న గుంతలను కూడా పూడ్చలేని నాయకులకు ఎయిర్‌పోర్టుల సంగతి ఎందుకని, వాటిని తాము చూసుకుంటామని బదులిచ్చానని సోము వీర్రాజు వివరించారు. బస్సు కూడా వెళ్ల లేని కర్నూలులో ఎయిర్ పోర్టును నిర్మించిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదని గుర్తు చేశానని పేర్కొన్నారు.

అంతకుముందు..
చివరికి కడపలో కూడా విమానాశ్రయాన్ని తమ బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిందని సోము వీర్రాజు అన్నారు. ప్రాణాలను తీసేసే వారి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ వచ్చిందని అన్నారు. కడపవాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చని, అక్కడ ఎయిర్పోర్ట్ చేశామని చెప్పారు. విమానాశ్రయాల సంగతి తాము చూసుకుంటామని, రోడ్లు వేసుకుంటే చాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కొత్త జిల్లాలకు మరిన్ని పేర్లు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.