• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిరణ్‌కు షాకిచ్చిన అశోక్‌బాబు: చంద్రబాబుకే మద్దతు

|

హైదరాబాద్: తన వెనకే ఉన్నారనుకున్న ఏపిఎన్జీవోలు సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డికి షాకిచ్చారు. ఇటీవల పలు ఉద్యోగ సంఘాల నేతలు ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో చంద్రబాబును ఉద్యోగ సంఘాల నాయకులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే విషయంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన సందర్భంలో తనకు మద్దతుగా నిలిచిన ఉద్యోగ సంఘాలు ఆ తర్వాత కూడా తనతో ఉంటారనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి.. తాజా పరిణామంతో అయోమయంలో పడ్డట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగల సంఘాలను దశలవారీగా విరమింపజేసిన కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. సమైక్యాంధ్ర కోసం తానే పోరాటం చేస్తానని చెప్పిన కిరణ్, ఉద్యోగులు తమ విధులు నిర్వహించాలని కోరారు. అయితే పార్లమెంటుతోపాటు రాష్ట్రపతి కూడా విభజన బిల్లుకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది.

APNGOs to ditch Kiran’s ‘sinking ship’, hitch on to Naidu

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతానని, తెలుగు ప్రజలను ఐక్యంగా ఉంచడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు కూడా తన పార్టీకి మద్దతు తెలుపుతారని కిరణ్ కుమార్ రెడ్డి భావించారు. కాగా, రాష్ట్ర విభజన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా కొత్త పార్టీ పెట్టిన నాటి నుంచి సీమాంధ్ర ప్రాంతంలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.

విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఆదరణ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొనే పర్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఏపిఎన్జీవోల నేతలు చంద్రబాబును కలిసి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అశోక్ బాబుకు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే అశోక్ బాబుకు అందుకు నిరాకరించినట్లు సమాచారం.

సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న పలువురు ఏపిఎన్జీవోల నాయకులకు కూడా కొన్ని సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలనుకునే కొందరు నాయకుల పేర్లను చంద్రబాబుకు అశోక్ బాబు ప్రతిపాదించినట్లు సమాచారం. డాక్టర్స్ జెఏసి ఛైర్మన్ కడియాల రాజేంద్రకు హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి లేదా జూబ్లిహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని అశోక్‌బాబు తన ప్రతిపాదనలను బాబు ముందుంచినట్లు తెలిసింది.

ఎకనామిక్ ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడు లంక దివాకర్‌కు ఒంగోలు నియోజకవర్గం స్థానాన్ని కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఎన్జివో నాయకుడు క్రిస్టోఫర్‌కు కర్నూలు సీటు కేటాయించాలని అశోక్ బాబు కోరినట్లు తెలిసింది. కాగా, నాయకత్వ లక్షణాలుండి, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులకు సీటు కేటాయించే అవకాశం ఉందని టిడిపికి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.

ఇటీవల అశోక్ బాబు ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేసిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే టిడిపికే ఉద్యోగ సంఘాల మద్దతు ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన సీమాంధ్ర ప్రజలను కోరారు.

English summary
Deserting what appears to be the 'sinking ship' of Kiran Kumar Reddy, the 6-lakh strong APNGO association is all set to extend support to TDP supremo N Chandrababu Naidu in the ensuing general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X