ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ నిబద్ధత .. తన ప్రాణం పోతున్నా ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ తాను చేసే వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. ప్రాణం పోతున్నా సరే ప్రయాణికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్న డ్రైవర్ బస్సు ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తగా పక్కగా ఆపాడు. ఆపై ప్రయాణికులను కాపాడిన సదరు బస్సు డ్రైవర్ దీర్ఘ నిశ్వాసను విడిచి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అటు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ , ఆ బస్సులో ప్రయాణించిన వారిలోనూ చర్చనీయాంశంగా మారింది.

తీవ్రమైన గుండెనొప్పి వచ్చినా ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా జి కొండూరు మండలంలో ఓ బస్సు డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నా ఉద్యోగ ధర్మాన్ని మాత్రం వీడలేదు. కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగోలు కు చెందిన కృష్ణారావు అనే డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తిరువూరు నుండి విజయవాడకు బస్సు నడుపుతున్న క్రమంలో డ్రైవర్ కృష్ణారావు జి.కొండూరు మండలం లక్కిరెడ్డి సమీపానికి రాగానే అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతున్న ఆయన, ప్రాణాలు ఉక్కిరిబిక్కిరవుతున్నా సరే ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని అనుకున్నాడు.

బస్సు నడిపే సమయంలో .. ప్రాణాలు పోతున్నా రోడ్డు పక్కన బస్సు ఆపిన డ్రైవర్
విపరీతమైన గుండెనొప్పితో అల్లాడిపోతున్న ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ కృష్ణారావు ప్రయాణికుల భద్రత తన ప్రాణం కంటే ముఖ్యమని భావించి, స్టీరింగ్ వదలకుండా పట్టుకొని, బస్సును అదుపుతప్పనివ్వకుండా, రోడ్డు పక్కన ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. తనకు ఎంత అవస్థ అవుతున్నా సరే , ప్రాణాలే పోతున్నా ప్రయాణికుల ప్రాణాలు కాపాడటమే తన కర్తవ్యంగా భావించిన డ్రైవర్ కృష్ణారావు రోడ్డు పక్కన బస్సు ఆపిన కొద్ది క్షణాలకే బస్సులోనే కన్నుమూశారు. డ్రైవర్ బస్సు ఎందుకు ఆపాడో అర్థంకాని ప్రయాణికులు, డ్రైవర్ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆయన తల వాల్చేశారు . అనంతలోకాలకు చేరిపోయాడు.

తమను కాపాడి ప్రాణాలు వదిలిన డ్రైవర్ కు ప్రయాణీకుల నివాళి .. ఆ డ్రైవర్ నిబద్ధతకు సెల్యూట్
ఈ ఘటనతో షాక్ తిన్న ప్రయాణికులు, సమయస్ఫూర్తితో బస్సును ఆపి తమ ప్రాణాలు కాపాడి మరి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కృష్ణారావు మృతదేహానికి నివాళులర్పించారు. ప్రాణం పోయే సమయంలో కూడా ప్రయాణికుల ప్రాణాలు కాపాడటమే కర్తవ్యంగా భావించిన ఆర్టీసీ డ్రైవర్ కు అందరూ సెల్యూట్ చేశారు. ఆ డ్రైవర్ చాలా గొప్పవాడన్నారు. కృష్ణారావు మృతదేహాన్ని పోలీసులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బస్సులోని ప్రయాణికులను వేరే బస్సు ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు.