
ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు ఇలా: రేపట్నుంచే బాదుడు షురూ, ప్రజలకు అలర్ట్
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల బాదుడుకు ముహూర్తం ఖరారు చేసింది. శుక్రవారం(జులై 1) నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలదేని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. అయితే, డీజిల్ సెస్ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో..
డీజిల్ సెస్ పెంపు కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఏపీలో ఛార్జీలు పెంచలేమని చెప్పినప్పటికీ.. చివరకు
ఈమేరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు టీఎస్ ఆర్టీసీ అధికారులు గతంలో సర్క్యులర్లను కూడా పంపారు టీఎస్ ఆర్టీసీ అధికారులు. ఆయా రాష్ట్రాల ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని కోరింది. అయితే, ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం.. చివరకు టికెట్ ధరలు పెంచేందుకు సిద్ధమైంది. జులై 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏపీఆర్టీసీ ఛార్జీల పెంపు ఇలా.. తెలుగు ప్రజలపై భారం
పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10గా ఉంది. తొలి 30కిలోమీటర్ల వరకు సెస్ పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్ విధించారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10. 100 కి.మీ ఆపైన రూ.120 సెస్ విధించారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 30 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10 పెంచారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంపు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ విధించారు. ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగ్గా.. ఇప్పుడు ఏపీలో కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై భారీగా భారపడనుంది.