6 వేల కోట్లకు ఏపీఎస్ ఆర్టీసీ నష్టాలు-ఎండీ ఠాకూర్ ప్రకటన-సాయిరెడ్డి లాభాల ట్వీట్ ఫేక్ ?
ఏపీఎస్ ఆర్టీసీ లాభాల్లో ఉఁదా ? నష్టాల్లో ఉందా అనే అంశంపై వైసీపీ సర్కారులోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేసిందోచ్ అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి గత వారం ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్టీసీ ఆరు వేల కోట్ల నష్టాల్లో ఉందంటూ ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కాకినాడలో ప్రకటించారు. దీంతో వీరిద్దరి మాటల్లో ఏది నిజం అన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా అధికారులు వాస్తవాలతో సంబంధం లేకుండా అంకెల గారడీ చేసేందుకు ఇష్టపడరు. ఈ లెక్కన చూస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ తప్పని అర్ధమవుతోంది.

ఆర్టీసీ ఆర్ధిక పరిస్ధితిపై భిన్నాభిప్రాయాలు
ఉమ్మడి ఏపీ నుంచి నష్టాల బాటలోనే సాగుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ పరిస్ధితి కరోనా తర్వాత మరింత దయనీయంగా మారిపోయింది. కరోనా ప్రభావం తగ్గినా ఇప్పటికీ గతంలోలా పూర్తి స్ధాయిలో బస్సులు నడిపేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఆదాయం కూడా భారీగా పడిపోయింది. కేవలం పండగల సమయాల్లో అదనపు బాదుడుతో కొంత లాభాలు కనిపిస్తున్నా.. మొత్తంగా చూస్తే ఆర్టీసీ నష్టాలు ఇప్పట్లో తీరే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు. కానీ వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక జరిగిన ఉద్యోగుల విలీనం తర్వాత ఆర్టీసీ పరిస్ధితి మెరుగ్గానే ఉందని ప్రభుత్వం చెప్పుకుంటోంది.

ఆరు వేల కోట్లకు ఏపీఎస్ ఆర్టీసీ నష్టాలు
ఏపీఎస్‌ఆర్టీసీ తాజా పరిస్ధితిపై ఎండీ ఆర్పీ ఠాకూర్ తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ .. ఆరు వేల కోట్ల నష్టాల్లో ఉందని ప్రకటించారు. డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఇంధనం పొదుపు చాలా అవసరమని ఉద్యోగులకు గుర్తు చేశారు. లీటర్ డీజిల్ రూపాయి పెరిగితే నెలకు 2.4 కోట్ల అదనపు భారం తప్పడం లేదన్నారు. ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి పనిచేసి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఉద్యోగులకు హితవు పలికారు. ఉద్యోగులకు పెండింగ్ జీతాల బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిదంటూ సాయిరెడ్డి ట్వీట్
ఆర్టీసీ 6 వేల కోట్ల నష్టాల్లో ఉందని స్వయంగా ఆర్డీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేయడంతో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఆర్టీసీ 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చిందంటూ సాయిరెడ్డి ఈ నెల 15న ట్వీట్ చేశారు. దీనికి కారణం సీఎం జగన్ దూరదృష్టే అన్నారు. అంతే కాదు ఇలా ఒక్క సంస్ధనైనా లాభాల్లోకి తీసుకొచ్చావా అంటూ విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. అయితే ఇప్పుడు ఆర్పీ ఠాకూర్ ప్రకటనతో సాయిరెడ్డి ట్వీట్ ఫేక్ అని తేలిపోయింది.

సాయిరెడ్డి గాలి తీసేసిన ఆర్టీసీ ఎండీ ప్రకటన
గత 15 ఏళ్లుగా నష్టాల్లోనే ఉన్న ఆర్టీసీ ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతోంది. ఇందులో మారిందేమీ లేదు. ఉద్యోగుల విలీనంతో భారం మరింత పెరిగింది. దీంతోపాటు అప్పులు ఎలాగో ఉన్నాయి. వాటికి నెలనెలా వడ్డీలు చెల్లించక తప్పని పరిస్ధితి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఆర్టీసీ 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఇదంతా సీఎం జగన్ వల్లే అంటూ ట్వీట్ పెట్టడం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవాళ స్వయంగా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ చేసిన నష్టాల ప్రకటనతో సాయిరెడ్డి ట్వీట్ గాలి తీసేసినట్లయింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.