
APSRTC : సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు- 50శాతం అదనపు ఛార్జీలు-ఈ తేదీల్లో
ఏపీలో సంక్రాంతి సీజన్ రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది. రెండేళ్లుగా కరోనా కారణంగా సంక్రాంతి సీజన్ కళ తప్పంది. ఈ సారి కూడా ఓమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి. అయితే ఏపీలో కేసుల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఈ సీజన్ లో జనం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఇందుకు తగినట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
సంక్రాంతి పండుగ సీజన్ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోనూ, బయటి ప్రాంతాలకు కలిపి 1266 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచబోతోంది. ముఖ్యంగా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ బస్సులను ఏర్పాటు చేశారు.

జనవరి 7 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు కింది స్ధాయి అధికారులకు ఆదేశాలు పంపారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని తెలిపారు.
ఆర్టీసీ ఎప్పటిలాగే ఈ సంక్రాంతి సీజన్ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సుల్లోనూ 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. గత రెండు సంక్రాంతి సీజన్లలో ప్రయాణికుల్లేక భారీగా నష్టాలు చవిచూసిన ఆర్టీసీ.. ఇప్పుడు వాటిలో కొంతైనా భర్తీ చేసుకునేమందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేక బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది.