ఇక చిల్లర సమస్య ఉండదు: ‘స్వైపింగ్’ చేయిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ
విజయవాడ: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు చిల్లర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా జనం చిల్లర లేక, దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకుంది. వెంటనే స్వైపింగ్ మిషిన్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో చిల్లర సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన స్వైపింగ్ మెషీన్లను రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభించారు. తొలిదశలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండులు, రిజర్వేషన్ కేంద్రాల్లో 50 స్వైపింగ్ మెషీన్లను అందుబాటులోకి తెచ్చారు.

వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు, రిజర్వేషన్ కేంద్రాల్లో స్వైపింగ్ మెషిన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, పెద్దనోట్ల రద్దు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. రెండు వారాల్లో రూ.17కోట్ల ఆదాయానికి గండి పడినట్లు ఎండీ మాలకొండయ్య వెల్లడించారు. అందుకే నగదు రహిత లావాదేవీలను పెంచే లక్ష్యంతో బస్టాండ్లలో ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ తరహా యంత్రాలు ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు వివరించారు. చిల్లర సమస్యను తీర్చేందుకు స్వైపింగ్ మిషిన్ల వాడటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా స్వైపింగ్ మిషన్లను విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరముందని అభిప్రాయడుతున్నారు.












Click it and Unblock the Notifications