araku bus accident visakhapatnam Governor chandrababu kcr అరకు బస్సు ప్రమాదం విశాఖపట్నం గవర్నర్ చంద్రబాబు కేసీఆర్
అందాల అరకులో తీవ్ర విషాదం -బస్సు దుర్ఘటనపై ఏపీ గవర్నర్, టీసీఎం కేసీఆర్, చంద్రబాబుల దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన అరకు లోయలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యులు స్పందించారు. విశాఖపట్నం జిల్లా అరకులోని ఘాట్ రోడ్డు వెంబడి అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్ బస్సు లోయలో పడిన ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
వెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్‌కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అరకునుంచి హైదరాబాద్ తిరిగివెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఎస్‌కోట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తొలుత స్పందించిన ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. జిల్లా కలెక్టర్ విజయ్‌చంద్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

విశాఖ జిల్లా అరకు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది పర్యాటకులు మృతి చెందిన దుర్ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్సను అందించాలని సంబంధిత అధికారులకు గవర్నర్ సూచించారు. మరోవైపు..

అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అరకు ఘాట్ రోడ్డులో జరిగిన విషాద ఘటన కలచివేసిందని, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడిన సంఘటన చాలా దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. బస్సు బోల్తా పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.