బీజేపీ నేత సాధినేని యామిని అరెస్ట్ .. మేమేమైనా తీవ్రవాదులమా? అంటూ యామిని ఫైర్
ఛలో అమలాపురం కార్యక్రమంలో భాగంగా నిరసన తెలిపేందుకు వెళ్లడానికి ప్రయత్నించిన బిజెపి నాయకురాలు సాధినేని యామిని శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. సాధినేని యామిని పోలీసుల అరెస్టులపై తీవ్రంగా స్పందించారు. ఛలో అమలాపురంలో భాగంగా దేవాలయాల పరిరక్షణ కోసం బిజెపి నాయకులు వస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బిజెపి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు వారిని ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా తెలియడం లేదని అన్నారు.
ఛలో అమలాపురం.. అనుమతి లేదు.. మత విద్వేషాలు రగిలిస్తే సహించం : ఏలూరు రేంజ్ డీఐజీ వార్నింగ్

శాంతియుతంగా నిరసన తెలిపితే బలవంతపు అరెస్టులా ?
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో న్యాయం చేయమని శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేయడానికి వస్తే పోలీసులతో బలవంతపు అరెస్ట్ లకు పాల్పడటం దారుణమని మండిపడ్డారు. మేమేమైనా తీవ్రవాదులమా అంటూ సాధినేని యామిని ప్రశ్నించారు. హిందూ దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయడం, హిందూ దేవాలయాలలో అన్యమతస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తదితర చర్యలకు దిగుతున్న ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

హిందువులు చేసిన తప్పేంటి ?
అసలు హిందువులు చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నించి సాధినేని యామిని, దేవాదాయ శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సాధినేని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన, ఆ తర్వాత నందీశ్వరుని చెవులు ధ్వంసం చేసిన ఘటన, విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు మాయం ఘటన... ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా దేవాదాయ శాఖ మంత్రి పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారు కానీ, దేవాదాయ శాఖ మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించడం లేదని సాధినేని యామిని ఫైర్ అయ్యారు .
దేవాదాయ శాఖామంత్రి రాజీనామా చెయ్యాలని డిమాండ్
హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇంతగా ఆందోళన చేస్తుంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ సంఘీభావం తెలుపకపోవటం హిందూ దేవాలయాల పై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి తక్షణం రాజీనామా చెయ్యాలన్నారు .అక్రమ అరెస్టులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సాధినేని యామిని. తమను అంబాజీపేట పోలీస్ స్టేషన్ కు తరలించారని పేర్కొన్న యామిని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు .
అరెస్ట్ లు చేసినా తమ పోరాటం ఆగదని , హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆఖరి క్షణం వరకు పోరాటం సాగిస్తామని సాధినేని యామిని పేర్కొన్నారు .