పరువుతీసేలా.. సంచయితపై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు: కుటుంబ తగాద కాదంటూ బొత్సకు చురక
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయితపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు. సంచయిత వ్యవహారశైలిపై ఆయన మండిపడ్డారు. వంశపారంపర్య నియమాలను ఆమె గౌరవించడం లేదని అన్నారు. ఏపీ సర్కారుపైనా ఆయన విమర్శలు చేశారు.

సర్కారు చీకటి జీవోలు తెచ్చి..
మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని, చీకటి జీవోలను తెస్తోందని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. సింహాచలం పరిధిలో ఉన్న 104 ఆలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచయితను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఆయన ఈమేరకు స్పందించారు.

చట్టవిరుద్ధంగా తొలగించారు..
ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి తొలగించే విషయంలో తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడంపై అశోక్ గజపతిరాజు ప్రభుత్వంపై మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా ఆ పదవి నుంచి తనను తొలగించారని ధ్వజమెత్తారు. ఛైర్మన్ పదవి ఆనవాయితీగా వచ్చేదని.. కానీ, కోర్టు తీర్పులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఇందుకు వ్యతిరేకంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.

సంచయిత కుటుంబ పరువుతీస్తోంది..
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కుటుంబాన్ని అభాసుపాలు చేస్తున్నారని సంచైతపై పరోక్ష విమర్శలు చేశారు అశోక్ గజపతిరాజు. ఆమె ఎందుకలా చేస్తున్నారో అంటూ అసహనం వ్యక్తం చేశారు. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వం కన్నుపడిందని ఆయన ఆరోపించారు. తాత, తండ్రి ఎవరో తెలియని సంచయిత.. 105 దేవాలయాల్లో ఒక్క పండగకైనా వచ్చి ఉంటే కోట బురుజు వద్ద ఎలా ప్రవర్తించాలో తెలిసేదని అన్నారు.

భక్తుల ఆస్తే... బొత్సకు చురకలు
మాన్సాస్ వ్యవహారాన్ని మంత్రి బొత్స కుటుంబ తగాదాగా పేర్కొనడంపై మండిపడ్డారు. ఇది కుటుంబ ఆస్తికాదని, ఆస్తులన్నీ దేవాలయాలకే చెందుతాయని అన్నారు. ఇందులో ఒక్కపైసా కూడా తాను ముట్టుకోలేదన్నారు. భక్తులు హుండీలో వేస్తే కుటుంబ ఆస్తి ఎలా అవుతుందని బొత్సను అశోక్ ప్రశ్నించారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఘటన, మాన్సాస్ విద్యా సంస్థల్లో ఉద్యోగులు భిక్షాటన చేయడం బాధాకరమని ఆయన అన్నారు.