చిత్తూరు మాజీమేయర్ హేమలతపై పోలీసులదుశ్చర్య: చర్యకు ప్రతిచర్య ఉంటుందని అచ్చెన్న, లోకేష్ వార్నింగ్
చిత్తూరు జిల్లాలో మాజీ మేయర్ హేమలత పై పోలీసుల దుశ్చర్యపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు దిగజారిపోయారు అని అచ్చెన్నాయుడు, లోకేష్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల మాదిరిగా ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారులను వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.

మహిళను పోలీసులు జీపుతో తొక్కించారు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అచ్చెన్న
వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా వెనుకాడడం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలకు పోలీసులు వత్తాసు పలకడం దారుణమని విరుచుకుపడ్డారు. మహిళను పోలీసులు జీపుతో తొక్కించారు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి టీడీపీని బెదిరించాలనుకుంటున్నారా?
బాధితులపైన తిరిగి కేసులు పెట్టి బెదిరించాలి అనుకోవడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని పేర్కొన్న అచ్చెన్న చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. వైసిపి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి తెలుగు దేశం పార్టీని బెదిరించాలి అనుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అంటూ అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

పోలీసులా.. వైసీపీ ఫ్యాక్షన్ సైన్యమా: లోకేష్
ఇక ఇదే సమయంలో మీరు పోలీసులా లేదంటే ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యమా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులను టార్గెట్ చేశారు. హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా ? అంటూ లోకేష్ పోలీసులను సూటిగా ప్రశ్నించారు. అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి, అమ్ముతున్నాడని పోలీసులే అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ఇదేం అన్యాయం అని నిలదీసిన హేమలత మీద నుంచి పోలీసు వాహనం పోనిచ్చారంటే వీళ్లంతా పోలీసులు కాదు వైసిపి ఫ్యాక్షన్ సైన్యం అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యమా పోలీసులు: లోకేష్ ప్రశ్న
వీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులేనా అంటూ లోకేష్ పోలీసులను నిలదీశారు. వైయస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యం గా పోలీసులపై లోకేష్ ఆరోపణలు గుప్పించారు. వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అసహనం వ్యక్తం చేసి పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోవడానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత మహిళ అని అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు.

వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న టీడీపీ అధినేత
పోలీసులు ఎవరి అండ చూసుకొని ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం చేయించిన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు, ప్రభుత్వానికి తొత్తులుగా మారి, వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గాడితప్పిన ప్రతి ఒక్క అధికారి పై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.