atchannaidu chief minister ys jagan mlas mps ycp tdp center withdrawal struggle chandrababu vishakhapatnam ప్రైవేటీకరణ అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎమ్మెల్యేలు వైసిపి టిడిపి ఉపసంహరణ పోరాటం చంద్రబాబు విశాఖపట్నం Visakhapatnam Steel Plant politics
విశాఖ ఉక్కు కోసం జగన్ ముందు షాకింగ్ ప్రతిపాదన పెట్టిన అచ్చెన్నాయుడు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ వేదికగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కేంద్ర నిర్ణయాన్ని మార్చుకునే వరకు పోరాటం సాగించాలని ఇప్పటికే విశాఖ ఉక్కు ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష పార్టీలు విశాఖ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖ ఉక్కు ఉద్యమం పై సంచలన ప్రతిపాదన పెట్టారు.

వైసిపి , టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి కలిసి పోరాడుదాం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం వైసిపి , టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి కలిసి పోరాడుదామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సూచించారు. అంతేకాదు అవసరమైతే జగన్ నేతృత్వంలో ఉద్యమంలో ముందుకు సాగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడానికి సీఎం తో పాటు వెళ్లడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు మాట్లాడలేదని అసహనం
ఉక్కు కర్మాగారాన్ని కాపాడడానికి ఎంపీలు ఎవరు రాజీనామా చేసినప్పటికీ మా పార్టీ నుంచి పోటీ పెట్టబోమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎంతోమంది త్యాగ ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడడానికి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై ఇంతవరకు మాట్లాడలేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై దృష్టి సారించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని అలాంటి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి అంటూ ఆయన ప్రశ్నించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డినే
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న అచ్చెన్నాయుడు ఎవరో రాసిచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టి కేంద్రానికి లేఖ పంపించారు అంటూ ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కోసం ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా బాధ్యత కలిగిన పార్టీగా పోరాడుతున్నామని పేర్కొన్న అచ్చెన్నాయుడు, చంద్రబాబు విశాఖ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.