kinjarapu atchannaidu atchannaidu tdp visakhapatnam vijayasai reddy sajjala ramakrishna reddy AP Municipal Elections 2021 AP Local Body Elections 2021 అచ్చెన్నాయుడు టీడీపీ విశాఖపట్నం విజయసాయి రెడ్డి politics
సజ్జల బ్రోకర్.. విజయసాయి దందాలు: విశాఖలో అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నం రెల్లి వీధి 33,35,37 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఏపీలో రాక్షస పాలన.. ప్రజల నెత్తిపై లక్ష కోట్ల అప్పులు
రాష్ట్రంలో రాక్షస పాలన, దొంగల పాలన నడుస్తోందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను నిండా దోచుకుంటున్నారని, పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో లక్ష కోట్ల అప్పు ప్రజల నెత్తిన వేశారని ఆయన అన్నారు. హుధుద్ సమయంలో చంద్రబాబు ఇక్కడే ఉండి సేవలు అందించిన విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు చెప్పారు.

సజ్జల బ్రోకర్లా.. విజయసాయి దందాలు
16 నెలలు జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇక్కడికి వచ్చి దందాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇక్కడి వైసీపీ నాయకులకు దమ్ములేదా? అని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణ ఒక బ్రోకర్ లా పనిచేస్తున్నారని, పోలీసులను బెదిరించి రౌడీయిజం చేయిస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

టీడీపీని గెలిపించండి..
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ ప్రజలకు ఏం అభివృద్ధి చేసిందో చూపించాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పన్నులు, నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్ రేట్లు పెంచేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే నీటి పన్నులు మాఫీ చేస్తామని, ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.

భూముల్లో వాటా కొట్టేసేందుకే వైసీపీ మొసలికన్నీరు..
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మార్చి 5న జరిగే బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర బంద్‌ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సమైక్య పోరాటం చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని వ్యాఖ్యానించారు. భూముల్లో వాటా కొట్టేసేందుకే వైసీపీ మొసలికన్నీరు కారుస్తోందన్నారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కాగా, మార్చి 5న తలపెట్టిన బంద్‌కు అధికార వైసీపీ కూడా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.