ఆత్రేయపురం భారీ పూతరేకు...ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు!
Recommended Video

విజయవాడ:ఘుమఘుమలాడే ఇంపైన నేతివాసనలతో మధురమైన తియ్యదనాన్ని పల్చటి పొరలుగా పేర్చి అద్భుతమైన వంటకంగా మలిస్తే అదే పూతరేకు...స్వీట్ వెరైటీల్లో పూత రేకుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ ఆత్రేయపురం పూత రేకుకు తెలుగువాళ్లలో ఉన్న క్రేజే వేరు.
అంతగా అందరి మనసులు దోచుకున్న ఆత్రేయపురం పూతరేకు ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డ్ సాధించింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఒక భారీ పూతరేకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. రుచిలోనే కాకుండా రూపంలోనూ భారీగా అవతరించి ఈ సరి కొత్త రికార్డు స్థాపించింది. పూతరేకుకు అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఎపి ప్రభుత్వం...భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ తో కలసి ఈ ఫీట్ సాధించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన వంటకాలకు మరింత ప్రాచుర్యం...ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గోదావరి జిల్లాల్లో పుట్టి ప్రాశస్త్యం చెందిన పూతరేకును అంతర్జాతీయ బ్రాండ్ గా మలిచేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ, భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ లు సంయుక్తంగా కృషి చేసి అత్యంత భారీ పూత రేకును తయారుచేయించారు.
భవానీపురం హరిత బెర్మ్‌పార్క్‌లో 10 మీటర్ల పొడవైన భారీ పూత రేకును తయారు చేసే ఈవెంట్‌ను పర్యాటక శాఖ సీఈవో హిమాన్షు శుక్లా గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. పూత రేకుల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆత్రేయపురం నుంచి పాక శాస్త్ర నిపుణులు శ్రీలక్ష్మి, శేషారత్నం, మహేశ్వరి, బాల సుబ్రహ్మణ్యం, నరేష్ అనే వారిని ఇక్కడకు రప్పించి తయారీ పనులు అప్పగించారు.
ఆ ప్రకారం వారు తొలుత కుండపై పూతలు తీసి ఆ తరువాత వాటిని మధుర పదార్థాలతో నింపి సాయంత్రం వీటన్నింటినీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఒకదానికొకటి కలుపుతూ చుట్టలు చుడుతూ 10.8 మీటర్ల పొడవైన పూతరేకును తయారీని పూర్తి చేశారు. దీన్ని పరిశీలించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిథి సంతూ చుహాన్ తమ బుక్ లో దీనికి స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో అధికారికంగా ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications