సీజేకు జగన్ లేఖ: కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించలేం, కానీ..: అటార్నీ జనరల్
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించేమంటూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మరోసారి స్పష్టం చేశారు.

కలకలం రేపిన సీఎం జగన్ లేఖ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ జగన్ సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా, వైఎస్ జగన్ లేఖ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. జగన్ లేఖకు కొంత మంది మద్దతు తెలుపగా, ఇంకొంత మంది వ్యతిరేకించారు. చట్టం ముందు ఎవ్వరూ అతీతులు కాదని మరికొందరు వ్యాఖ్యానించారు. కాగా, ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లాం మీడియాకు విడుదల చేశారు. దీనిపై వివాదం చెలరేగింది.

కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ..
ఈ క్రమంలో కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ వైఎస్ జగన్, అజేయ కల్లంలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖను పరిగణలోకి తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇప్పటికే ఒకసారి నిరాకరించారు.

కోర్టు ధిక్కరణ చర్యలకు నిరాకరించినప్పటికీ..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతి తెలియజేయడం సాధ్యపడదన్న తన నిర్ణయాన్ని పునర్ సమీక్షించేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నిరాకరించారు. అయితే, తాను అసమ్మతి తెలియజేయనప్పటికీ.. సదరు న్యాయవాది ఉపాధ్యాయ వాస్తవాలను సుప్రీంకోర్టు ఎదుట హాజరుపరుస్తూ.. సుమోటో యాక్షన్ కోరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.