వైసీపీ నుండి టీడీపీకి జంపింగ్ ప్లాన్ లో డేవిడ్ రాజు .. ఏం నష్టం లేదన్న మంత్రి బాలినేని
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీకి మారాలని భావిస్తారు. కానీ అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి మారాలనే ఆలోచన చేయటం ఒకింత షాకింగ్ అనిపించినా, అధికార పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం లేకపోవడం వల్లనే పాలపర్తి డేవిడ్ రాజు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
జగన్ కు తలనొప్పిగా చీరాల రచ్చ.. మత్య్సకారుల ఘర్షణతో పాటు పీక్స్ కి కరణం ,ఆమంచి వర్గ పోరు

జంపింగ్ ఆలోచనలో ప్రకాశం జిల్లా నేత డేవిడ్ రాజు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రకాశం జిల్లా రాజకీయాలలో తనకు వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో, తన పొలిటికల్ ఫ్యూచర్ పై దృష్టిపెట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీ లో సంత నూతలపాడు ఎమ్మెల్యేగా, ఒకసారి జడ్పీ చైర్మన్ గా పనిచేసిన డేవిడ్ రాజు 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన డేవిడ్ రాజు , 2014 ఎన్నికల సమయంలో టిడిపి అధికారంలోకి రావడంతో మళ్లీ టీడీపీ లోకి జంప్ అయ్యారు.

నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవటంతో డేవిడ్ రాజు తీవ్ర అసహనం
గత ఎన్నికల సమయంలో డేవిడ్ రాజుకు టిడిపి టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన డేవిడ్ రాజు 2019 ఎన్నికల్లో మళ్లీ వైసీపీలో చేరారు.
తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని వైసీపీ నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. వైసీపీ నేతలు డేవిడ్ రాజు ను పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో గత కొంత కాలంగా వైసిపి నేతల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డేవిడ్ రాజు టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు గా సమాచారం.

డేవిడ్ రాజు వెళ్ళినా ఏం నష్టం లేదన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
అయితే ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు . పార్టీలో పదవులు రానంత మాత్రాన పార్టీ మారాలనుకోవడం వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే సముచిత స్థానం ఉందని, పార్టీలు మారుతూ పదవులు కావాలంటే సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఒకసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్ రాజు టీడీపీ లోకి వెళ్లారని, మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారని ఇప్పుడు మళ్లీ వెళ్తానన్నా పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

డేవిడ్ రాజుపై టీడీపీ కి నో ఇంట్రెస్ట్... రెంటికీ చెడ్డ రేవడిలా మారతారా ?
ఇప్పటికే రెండు సార్లు అటు ఇటు జంప్ చేసిన ప్రకాశం జిల్లా నేత డేవిడ్ రాజు పై టీడీపీ నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీ మారడానికి రెడీగా ఉన్నారట డేవిడ్ రాజు. మొత్తానికి డేవిడ్ రాజు తన వ్యవహార శైలితో అటు టీడీపీకి ఇటు వైసీపీ కాకుండా రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతాడేమో అన్న చర్చ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.