ధ్వసం చెయ్యటం జగన్ రెడ్డికే సాధ్యం , లోకేశ్ సవాల్ని స్వీకరించే దమ్ముందా? అయ్యన్న, బుద్దా వెంకన్నసూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం కూడా రాజకీయ మంటలు రగులుతూనే ఉన్నాయి. ఏపీలో తాజాగా రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన నుంచి, మళ్లీ విగ్రహ ధ్వంస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రామతీర్థం శ్రీ రాముల వారి విగ్రహం ధ్వంసంతో పాటుగా, రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి చేతులు ధ్వంసం చేయడం, వైజాగ్ లో కోమాలమ్మ అమ్మవారి పాదాలు ద్వంసం చేయడం వంటి ఘటనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

సింహాద్రి అప్పన్న ఆలయానికి రావాలని సీఎం జగన్ కు సవాల్ చేసిన లోకేష్
ప్రభుత్వ వైఫల్యం అని ప్రతిపక్ష పార్టీ విమర్శలు గుప్పిస్తుంటే, ఈ ఘటన వెనుక టీడీపీనే ఉందని, చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఉందని వైసీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ చాలెంజ్ చేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి వస్తే తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. లోకేష్ చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము ఉందా అంటూ టిడిపి నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు.

విగ్రహాల ధ్వంసం లో ఏ1, ఏ2 హస్తముందన్న అయ్యన్న పాత్రుడు
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా వేదికగా మా నాయకుడు నారా లోకేష్ మగాడిలా సవాల్ విసిరాడు. స్వీకరించే దమ్ము వైయస్ జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఆరోపణలకు ఇక్కడితో చెక్ కాస్కో అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే సమయంలో విగ్రహాల ధ్వంసం, హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక ఏ 1, ఏ 2 హస్తముందని విగ్రహాల ధ్వంసం కేసులో వైసిపి నాయకులు పట్టుబడిన సమయంలోనే ప్రజలకు అర్థమైంది అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

తలలు తీయాలన్నా, విగ్రహాల ధ్వంసం చెయ్యాలన్నా అది జగన్ రెడ్డికే సాధ్యం :అయ్యన్న పాత్రుడు
అంతేకాదు ఇకనైనా నువ్వు కోతి వేషాలు ఆపి అధికారంలో ఉన్నది మీరే అనే సోయ తెచ్చుకో సాయిరెడ్డి అంటూ విజయసాయి రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తలలు తీయాలన్నా, విగ్రహాల ధ్వంసం చెయ్యాలన్నా అది జగన్ రెడ్డి కే సాధ్యమవుతుంది సాయి రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు జగన్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి అని నీ నోటితో నువ్వే అంగీకరించినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.

రాష్ట్రంలో హిందూ అనే పదం లేకుండా చేయాలనే కుట్ర : బుద్దా వెంకన్న
ఇక ఇదే తరహాలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా ట్విట్టర్ వేదికగా జగన్ కు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర అల్లకల్లోలానికి ప్లాన్ చేసింది ఎవరో ? ఉత్తరాంధ్రలో ముఠాలను దించి భూములను కొట్టేస్తోంది జగన్ మాఫియా అనేది అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. అంతేకాదు ఈ రాష్ట్రంలో హిందూ అనే పదం లేకుండా చేయాలనే కుట్ర ఉత్తరాంధ్ర నుంచి మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు.

ఫేక్ మాటలు జనం నమ్మరు అని బురద చల్లి పారిపోకు విజయసాయిరెడ్డి : బుద్దా వెంకన్న
హిందూ ద్రోహులను పట్టుకోలేని చేతగాని మంద అంటూ వ్యాఖ్యానించిన బుద్ధ వెంకన్న... లోకేష్ చేసాడు, చంద్రబాబు చేశాడని సొల్లు వాగుతున్నారు అంటూ మండిపడ్డారు. గతంలో ఇలాగే పింక్ డైమండ్ పై కబుర్లు చెప్పారని, ఇలాంటి ఫేక్ మాటలు జనం నమ్మరు అని బురద చల్లి పారిపోకు విజయసాయిరెడ్డి అంటూ బుద్ధ వెంకన్న విజయసాయి ని టార్గెట్ చేశారు. ఇక అధికారంలో ఉంది నీ అల్లుడే కదా ఇప్పటికైనా గుర్తించు అంటూ బుద్ధ వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.