బాలయ్య వెన్నుపోటు కామెంట్స్‌పై రాజకీయ రచ్చ: అవనసరంగా గెలికాడా?: టీడీపీలో చర్చ
ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు.. గుండెపోటుతో కన్నుమూశారని, వెన్నుపోటు వల్ల కాదంటూ ఆయన ఇచ్చిన వివరణ దుమారం రేపుతోంది. 37 సంవత్సరాల కింద చోటు చేసుకున్న అధికార మార్పిడి, వైస్రాయ్ ఉదంతాన్ని మళ్లీ తెరమీదికి తీసుకొచ్చినట్టయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు- బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తోన్నారు.

బాలకృష్ణం ఏం చెప్పారు..?
1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీ రామారావు మరణంపై ఇన్ని సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం సాగుతోందని బాలకృష్ణ చెప్పారు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే లేటెస్ట్ ఎపిసోడ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలో ఈ కామెంట్స్ ఉన్నాయి. అఖండ చిత్రం యూనిట్‌తో ఆయన తన ఆవేదనను పంచుకున్నారు.
తప్పుడు ప్రచారం..
వెన్నుపోటు పొడవటం వల్ల ఎన్టీ రామారావు మరణించారనేది తప్పుడు ప్రచారమని, అది తలచుకున్నప్పుడల్లా బాధ కలుతుందని చెప్పుకొచ్చారు. కళ్లల్లో నీళ్లు వస్తాయని అన్నారు. తాను ఎన్టీ రామారావు కుమారుల్లో ఒకడిని, అభిమానుల్లో ఒకడిని అని బాలకృష్ణ చెప్పారు. అక్కడితో ఈ ప్రొమో ముగుస్తుంది. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడవటం వల్ల మరణించాడనే విషయాన్ని తప్పుడు ప్రచారం అంటూ బాలకృష్ణ స్పష్టం చేసినట్టయింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్టీ రామారావు కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
గుండెపోటుకు కారణం వెన్నుపోటు కాదా..?
ఈ ప్రొమోలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు.. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్నాయి. గుండెపోటు రావడానికి కారణం వెన్నుపోటు కాదా? అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు.. ద్రోహం చేశాడో వివరిస్తూ ఎన్టీ రామారావు చేసిన వ్యాఖ్యలకు చెందిన వీడియో క్లిప్పింగ్స్‌ను దీనికి జత చేశారు. బాలకృష్ణ చేసిన తాజా కామెంట్స్‌కు అప్పట్లో ఎన్టీఆర్ వీడియో క్లిప్పింగ్స్‌ను యాడ్ చేసిన పోస్టింగులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వయంగా ఎన్టీ రామారావే చెప్పారంటూ..
తండ్రిలాంటి మామకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడంటూ స్వయంగా ఎన్టీ రామారావే ఈ విషయాన్ని చెప్పారని వైసీపీ సోషల్ మీడియా అభిమానులు స్పష్టం చేస్తోన్నారు. చంద్రబాబు.. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి గద్దె దించాడని ఈ రాష్ట్రంలో ఏ చెట్టును, పుట్టను అడిగినా చెపుతాయని, అది నందమూరి కుటుంబానికి తెలియకపోవడం వింతేనంటూ కామెంట్స్ చేస్తోన్నారు. వెన్నుపోటు పొడవటాన్ని, వైస్రాయ్ కుట్రను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఎన్ని కవర్ డ్రైవ్‌లు ఆడినా అది తెలుగుదేశం పార్టీకి నష్టమే తప్ప వచ్చే లాభం ఉండదని చెబుతున్నారు.

తన కుమారుల మీద కూడా
చంద్రబాబు నాయుడు తనను పదవీచ్యుతుడిని చేయడం పట్ల ఎన్టీ రామారావు అప్పట్లో తన కుమారుల వైఖరిని కూడా తప్పుపట్టారని వైసీపీ సోషల్ మీడియా అభిమానులు తేల్చి చెబుతున్నారు. వెన్నుపోటు అనేది తప్పుడు ప్రచారం కానే కాదని, కావాలంటే ఎన్టీ రామారావు చేసిన కామెంట్సే దీనికి నిదర్శనమని అంటున్నారు. తన అల్లుడు చంద్రబాబు, తన కుమారుల మీద స్వయంగా బాధితుడైన ఎన్టీ రామారావు తప్పుడు ప్రచారం చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు.