ఆన్ లైన్ రమ్మీ పై నిషేధం ... గ్యాంబ్లింగ్ సంస్థలకు చెక్ పెట్టేలా.. జగన్ సర్కార్ ప్రణాళిక
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్లైన్ రమ్మీ తో చాలామంది డబ్బులు పోగొట్టుకొని, సైబర్ మోసాలకు గురి అవుతున్న క్రమంలో ఆన్లైన్ రమ్మీ పై నిషేధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆన్ లైన్ రమ్మీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సదరు సంస్థలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయం తీసుకోనుంది.

ఏపీలో వ్యసనంగా మారిన ఆన్ లైన్ రమ్మీ .. చెక్ పెట్టే వ్యూహంలో సర్కార్
కరోనా లాక్ డౌన్ సమయంలో కృష్ణాజిల్లా నూజివీడులో ఒక బ్యాంకు ఉద్యోగి కోటికిపైగా మోసం చేసి ఐపీ పెట్టారు. ఇంతకీ బ్యాంకు ఉద్యోగి కోటి రూపాయలకు పైగా డబ్బులు ఏం చేశారన్నది ఆరా తీస్తే ఆయన ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్టుగా పోలీస్ అధికారులు గుర్తించారు. ఈ తరహా మోసాలు ఏపీలో విపరీతంగా జరిగాయంటే ఆన్లైన్ రమ్మీ ఎంత వ్యసనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఆన్లైన్ రమ్మీపై కఠిన నిర్ణయాల దిశగా ప్రభుత్వం
ఇప్పటికే మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తూ, దశలవారీగా మద్యం పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీ పై కూడా నిషేధం విధించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ రమ్మీతో మోసపోయిన వారు కేసులు పెడుతున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. రమ్మీకి బానిసలవుతున్న ఏపీ ప్రజలను కాపాడడం కోసం ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సైతం ఆన్లైన్ రమ్మి నిషేధించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి.

వందల కోట్ల గ్యాంబ్లింగ్ .. డబ్బు పోగొట్టుకుంటున్న ప్రజలు
గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరుతో ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశమంతటా ఆన్లైన్ రమ్మీ నిర్వహణ జోరుగా సాగుతోంది. ముంబై, బెంగళూరు తదితర కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి.ఆన్లైన్ రమ్మీ వల్ల ఏటా వందల కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ మాయలోపడి పోగొట్టుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా చిన్న పిల్లలు ,యువత వారికి తెలియకుండానే ఈ ఆన్లైన్ రమ్మీకి బానిసలవుతున్నారు . మొదట్లో ఆన్లైన్ రమ్మీలోకి దిగిన వారు ఆటల్లో గెలుస్తారు. దాంతో వారికి డబ్బు ఆశ చూపించి, ఆ తర్వాత క్రమంగా వారి డబ్బులు కొల్లగొట్టే కార్యక్రమం ఆన్లైన్ రమ్మి ద్వారా కొనసాగుతోంది.

ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధిస్తే ... ఆయా గ్యాంబ్లింగ్ సంస్థలపై ఉక్కుపాదమే
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీ పై నిషేధం విధిస్తూ త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.
ఏపీలో కూడా ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తే ఆన్లైన్ రమ్మీ నిర్వహించే సంస్థలు ఆయా రాష్ట్రాల నుండి ఆన్లైన్లో రమ్మీ ఆడే వారిని వారి ఐపీ అడ్రస్ ని బట్టి ఆటకు అనుమతించకూడదు. ఒకవేళ అలా అనుమతిస్తే సదరు ఆన్లైన్ రమ్మీ సంస్థపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిషేధం లేకపోయేసరికి ఆన్లైన్ రమ్మీ లో డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏపీలో ఆన్లైన్ రమ్మీ పై నిషేధం విధించి, సదరు గ్యాంబ్లింగ్ సంస్థలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు .