ఏపీలో బండి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్? -ఢిల్లీలో సోము వీర్రాజు, సంజయ్ -నడ్డాతో కీలక భేటీ -వ్యూహాత్మకంగా
తెలుగు రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త ఎత్తుగడను సిద్ధంం చేస్తోంది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా.. తెలంగాణతో పోల్చకుంటే ఏపీలో కమలం ఆశించిన స్థాయిలో వికసించకపోవడంతో ఆ లోపాన్ని అధిగమించే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జోష్‌ను ఏపీలోనూ నింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు..

ఢిల్లీలో సోము, బండి..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యేందుకుగానూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కమల సారథులు బండి సంజయ్ కుమార్, సోము వీర్రాజులు ఢిల్లీకి చేరారు. జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలుసుకుని కీలక మంతనాలు జరిపారు. పార్టీ కార్యకలాపాల్లో భాగంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులతోనూ నడ్డా సమావేశమవుతూ, సమీక్షలు నిర్వహిస్తున్న దరిమిలా, ఏపీ, తెలంగాణల అంశాన్ని మాత్రం ఒకింత ప్రత్యేకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. బండి, సోము.. నడ్డాతో విడివిడిగా భేటీ అయినప్పటికీ, కొన్ని ఉమ్మడి అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా..

బండి సంజయ్ సక్సెస్..
తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బీజేపీనే అని ప్రజలందరిలో ఒక భావన కలగజేయడంలో అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అయ్యారని హైకమాండ్ భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ పట్ల పెరిగిన అంచనాలు తగ్గిపోకుండా ఉండాలంటే మరింత దూకుడుగా పనిచేయాలని, అర్బన్ ఏరియాలకుతోడు ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాలకు సైతం పార్టీని విస్తరిస్తూ, ఇదే జోరును కొనసాగించాలని జేపీ నడ్డా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం కమలం కండువా కప్పుకొంటుండటం కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే..

తిరుపతి ఉప ఎన్నికే కీలకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు సంబంధించి త్వరలో జరుగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. తిరుపతి ఉప ఎన్నికలో ప్రదర్శన.. ఏపీలో బీజేపీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని కూడా హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని సోము వీర్రాజుకు నడ్డా నిర్దేశించినట్లు సమాచారం. తెలంగాణలో సాధించిన ఫలితాలతో ఏపీలోని బీజపీ నేతల్లో ఉత్సాహంతోపాటు ఒత్తిడి కూడా పెరిగిన దరిమిలా కొత్త తరహా వ్యూహాలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలని కమలనాథులు ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఇన్నాళ్లూ బీజేపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ వస్తోన్న ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వదిలించుకుని...

ఏపీలోనూ హిందూత్వ అస్త్రం..
రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ అన్యాయం చేశాయనే భావన ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. గత లోక్ సభ ఎన్నికల ఫలితాల నాడే.. ‘బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చింది. అదే వైసీపీపై ఆధారపడే పరిస్థితి ఉండుంటే సీన్ మరోలా ఉండేది'అంటూ సీఎం జగన్ ఆల్మోస్ట్ ప్రత్యేక హోదా కాడిని వదిలేసినట్లు మాట్లాడారు. అడపాదడపా ఢిల్లీ పర్యటనల సమయంలో హోదా అంశాన్ని నామమాత్రంగా లేవనెత్తుతూ వచ్చారు. బీజేపీ సైతం హోదా భారాన్ని పూర్తిగా వదిలించుకునే దిశగా.. ‘ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యం'అని సోము వీర్రాజు ఇటీవల కుండబద్దలు కొట్టారు. ఇతర అంశాలను వదిలేసి, హిందూత్వ అస్త్రంతోనే ఏపీలోనూ బలం పుంజుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లే..

ఏపీలో ప్రచారానికి బండికి గ్రీన్ సిగ్నల్?
ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై తరచూ దాడులు జరుగుతుండటం, తిరుపతి, శ్రీశైలం లాంటి ప్రసిద్ధ క్షేత్రాల్లో అపరాచారాలు చోటుచేసుకోవడంపై ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. శ్రీశైలం ఆలయంలో వివాదంపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరగడం తెలిసిందే. బీజేపీ అభిమానుల దృష్టిలో.. హిందూత్వకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఇమేజ్ పొందిన బండి సంజయ్‌ని.. ప్రముఖ హిందూ క్షేత్రమైన తిరుపతి ప్రచారానికి వాడుకోవడం ద్వారా లబ్ది పొందొచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తిరుపతి సీటును అధికార వైసీపీ మళ్లీ గెలిచుకున్నప్పటికీ, బండి సంజయ్ ప్రచారం ద్వారా ఏపీలో బీజేపీ పొలిటికల్ నెరేషన్ మార్చుకోవాలన్నది పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో బండి రాకకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా పార్టీ హిందూత్వ లైన్ కు బలం చూకూరుతుందని, తిరుపతిలో కనీసం రెండో స్థానాన్నయినా దక్కించుకోవడం ద్వారా టీడీపీ కంటే తానే మెరుగైన పోటీదారునని బీజేపీ నిరూపించుకున్నట్లవుతుందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, తిరుపతిలో బండి సంజయ్ ప్రచారంపై ఇప్పటి దాకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.
సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి