అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతి కోసం తాము భూములను త్యాగం చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని చెప్తున్న అమరావతి ప్రాంత రైతులు జగన్ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఉద్యమం కొనసాగిస్తున్నారు.

అమరావతి ఉద్యమంలోకి బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలని రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా, వివిధ ప్రాంతాల వారి మద్దతును కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంలో భాగంగా మహాపాదయాత్ర ను నిర్వహిస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్రకు దారి పొడవునా ప్రజల నుండి విశేష మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు రైతుల పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. బీజేపీ కూడా రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించింది.

అమిత్ షా దిశా నిర్దేశంతో రంగంలోకి బీజేపీ
అయితే ఇక ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశంతో బీజేపీ శ్రేణులు రాజధాని అమరావతి కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఇటీవల తిరుపతి పర్యటనలో అమిత్ షా రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించి, అమరావతి కోసం సాగుతున్న ఉద్యమంలో పాలుపంచుకోవాలని రాజధాని అమరావతి కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో కొత్త జోష్ తో ఏపీ బీజేపీ నేతలు రాజధాని రైతులకు బాసటగా వైసీపీ ప్రభుత్వం పై ప్రత్యక్ష పోరాటం మొదలు పెట్టారు.

అమరావతినే ఏకైక రాజధాని ... పాదయాత్రలో నినాదం అందుకున్న బీజేపీ నేతలు
ఆదివారం నాడు అమరావతి రైతుల పాదయాత్రలో సంఘీభావం ప్రకటించిన బీజేపీ నేతలు మూడు రాజధానులు ముచ్చట ఉండదని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, అమరావతి రైతులకు మద్దతుగా నిలవడం ప్రస్తుతం రాజధాని రైతులకు కొత్త బలం ఇచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా అమరావతి ప్రాంత రైతుల పోరాటానికి మద్దతు లభిస్తోంది.మొన్నటికి మొన్న రేణుకా చౌదరి అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తే, తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంఘీభావం, త్వరలో రైతుల వద్దకు
న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ 22 రోజులుగా పాదయాత్ర చేస్తున్న రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించిన బండి సంజయ్, తన మద్దతును రాజధాని అమరావతి రైతులకు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుండి బండి సంజయ్ కూడా అమరావతి రైతులకు మద్దతు తెలపడానికి త్వరలోనే వెళ్ళబోతున్నట్టు సమాచారం.
ఈ మేరకు పార్టీ హై కమాండ్ ఆయనకు సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రైతుల తదుపరి పోరాటాలకు కూడా జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనా నిన్నమొన్నటి వరకు అమరావతి రైతులు సాగించిన రాజధాని ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకోని నాయకులు, ఇప్పుడు రాజధాని అమరావతి ఉద్యమానికి వస్తున్న మద్దతు చూసి రంగంలోకి దిగుతుండటం విశేషం.