ఆర్బీఐ చెప్పినా ఆదేశాలు అందలేదంటున్న బ్యాంకులు .. ఈఎంఐల చెల్లింపు పై గందరగోళం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక దేశం మొత్తంలో ఎక్కడా దైనందిన కార్యక్రమాలు, వర్తక వాణిజ్యాలు జరగటం లేదు. నిత్యావసరాలను మినహాయించి అన్నీ వ్యాపారాలు ప్రస్తుతం మూత పడ్డాయి. ఇక ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.

3 నెలలు మారటోరియం అని చెప్పినా పట్టించుకోని పలు బ్యాంకులు
ఈ క్రమంలో చాలా మందికి వ్యాపారాలు లేక ఇంటికే పరిమితమవ్వడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు పని లేక చేతిలో డబ్బులు లేకుండా పోయాయి.ఇక ప్రతి నెల ఒకటో తేదీ వస్తే చాలు ఎంతో మందికి హోం లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్‌తో పాటు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకులకు మూడు నెలల పాటు ఈఎంఐ కట్టాల్సిన పనిలేకుండా మారిటోరియం విధిస్తున్నట్టు ప్రకటించింది. కానీ చాలా బ్యాంకులు అవేవీ పట్టించుకోకుండా లోన్స్ చెల్లించాలని మెయిల్స్ , మెసేజ్ లు పంపుతున్నారు.

తమకు ఆదేశాలు అందలేదని చెప్తున్న బ్యాంకుల , ఫైనాన్సు కంపెనీల సిబ్బంది
తెలుగు రాష్ట్రాల్లో ఖాతాదారులు బ్యాంకుల తీరుతో గందరగోళానికి గురవుతున్నారు. మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఎక్కడ అమలు కావడం లేదు. క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా యథావిధిగా కట్టాలంటూ బ్యాంకుల నుంచి మెసెజ్‌లు వస్తున్నాయని పలువురు కస్టమర్లు లబోదిబోమంటున్నారు. అయితే ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చాలా బ్యాంకుల సిబ్బంది, ఫైనాన్సు కంపెనీల సిబ్బంది చెప్తుండటం గమనార్హం .

ఎవరి మాట వినాలో అర్ధం కాని గందరగోళం
ఇక ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక బతుకు భారం కావటంతో మధ్యతరగతి ప్రజలంతా మారిటోరియంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలు బ్యాంకులు ఈ విషయంలో క్లారిటీ ఇస్తే కొన్ని బ్యాంకులు తమకు ఆదేశాలు రాలేదని రుణాల చెల్లింపు చెయ్యాలని చెప్పటంతో ఖాతాదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు ఆర్బీఐ, కేంద్రం చెప్పింది వినాలా ? లేకా బ్యాంకుల సిబ్బంది చెప్తున్నది వినాలా అన్నది అర్ధం కాక గందరగోళానికి గురవుతున్నారు.