వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుగు ముందుకేయని బెజవాడ మెట్రో: ఎల్ & టీ కోసమేనా? వ్యాపారుల ఒత్తిళ్లా?!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడలో మెట్రో రైలును పరుగులు పెట్టిస్తామని కొద్దికాలం వరకూ హడావుడి చేసిన చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పనులు ప్రారంభమయ్యే దశలో మీడియం మెట్రో ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లైట్‌ మెట్రో వైపు వెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు దాన్నీ పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్‌లో ఒక్క రూపాయీ కేటాయించలేదు.
అసలు ఇప్పటివరకూ లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనకే ముందడుగు పడలేదు. దీంతో మెట్రో ప్రాజెక్టు ఉంటుందో లేదోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారుల ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది.

బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా బెజవాడ మెట్రో

బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా బెజవాడ మెట్రో

విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం శ్రీధరన్‌ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)తో డీపీఆర్‌ (సవివర నివేదిక) తయారుచేయించి ఆమోదించింది. రూ.7,200 కోట్లతో బందరు, ఏలూరు రోడ్లలో రెండు కారిడార్లుగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. దాని నిర్మాణ బాధ్యతను కూడా డీఎంఆర్‌సీకే ప్రభుత్వం అప్పగించింది. డిజైన్లు, ఎలైన్‌మెంట్‌ సహా అన్ని పనులను డీఎంఆర్‌సీ పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి రెండుసార్లు టెండర్లు కూడా పిలిచింది. అయితే, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సిన సమయంలో ప్రభుత్వం హఠాత్తుగా అసలు ఈ ప్రాజెక్టే వద్దని యూ టర్న్‌ తీసుకున్నది.

ఇలా అటకెక్కిన బెజవాడ మెట్రో ప్రాజెక్టు

ఇలా అటకెక్కిన బెజవాడ మెట్రో ప్రాజెక్టు

ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ప్రాజెక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, 30 శాతం అదనంతో ఆ సంస్థ దాఖలు చేసిన టెండర్లపై శ్రీధరన్‌ అసంతృప్తి వ్యక్తంచేసి ఏకంగా టెండర్లే రద్దు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎల్‌ అండ్‌ టీకి పనులు అప్పగించేందుకు ఆయన నిరాకరించినందునే ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టునే రద్దుచేసినట్లు విమర్శలు ఉన్నాయి. మరోవైపు.. ఈ ప్రాజెక్టు వల్ల బందరు, ఏలూరు రోడ్లకిరువైపులా ఉన్న తమ సంస్థల వ్యాపారం దెబ్బతింటుందని బడా వ్యాపారులంతా గగ్గోలు పెట్టారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని వినికిడి. ఒకవైపు వ్యాపారుల ఒత్తిడి, మరోవైపు అదనపు రేటుకు తాను చెప్పిన కంపెనీకి పనులిచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును అటకెక్కించినట్లు తెలుస్తోంది.

జర్మనీ సంస్థకు లైట్ మెట్రో డీపీఆర్ బాధ్యతలు

జర్మనీ సంస్థకు లైట్ మెట్రో డీపీఆర్ బాధ్యతలు

ఇదిలా ఉంటే.. తక్కువ వ్యయంతో లైట్‌ మెట్రో ప్రాజెక్టును చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాని డీపీఆర్‌ బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థకు అప్పగించింది. వాస్తవానికి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు కేఎఫ్‌డబ్లు్య ఇక్కడకు వచ్చింది. దానికి డీపీఆర్‌ బాధ్యత అప్పగించడంతో ఇప్పటివరకూ ఆ పని పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ఆ సంస్థ ఉత్సాహంగా ఉన్నా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో అసలు లైట్‌ మెట్రో అయినా పట్టాలెక్కుతుందా లేదో అనుమానంగానే మారింది. ఒకవేళ కేఎఫ్‌డబ్లు్య సంస్థ డీపీఆర్‌ రూపకల్పన పనిని వెంటనే ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి ఆరు నెలలు పడుతుంది. ఆ తర్వాత భూసేకరణ, ఇతర పనులకు సమయం కావాలి. అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి ఏమాత్రం కనిపించడంలేదు. మరోవైపు, ప్రభుత్వ పెద్దలే కావాలని మెట్రోను పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2016లో బెజవాడ మెట్రో ప్రాజెక్టు రద్దు

2016లో బెజవాడ మెట్రో ప్రాజెక్టు రద్దు

జులై 2014లో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్‌ నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో డీఎంఆర్‌సీకి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ (సవివర నివేదిక) రూపకల్పన బాధ్యత అప్పగించారు. 2015
ఏప్రిల్‌లో ప్రభుత్వానికి డీఎంఆర్‌సీ సవివరమైన ప్రాజెక్టు నివేదిక ‘డీపీఆర్‌' సమర్పించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.6769 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. బస్టాండ్‌-పెనమలూరు, బస్టాండ్‌-నిడమానూరు కారిడార్లలో 26 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశారు. అందు కోసం 70 ఎకరాల భూమి సేకరించారు. ఇందుకు అదనంగా రూ.431 కోట్లు ఖర్చు చేశారని అంచనా. 2015 మేలో డీఎంఆర్‌సీ ఇచ్చిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందింది.
2015 అక్టోబర్‌లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసి.. దానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)గా నామకరణం చేసింది. 2016 ఫిబ్రవరిలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం జపాన్‌కు చెందిన జైకాతో చర్చలు కూడా జరిపింది. అదే ఏడాది జూన్ నెలలో ప్రాజెక్టుకు రెండు ప్యాకేజీలుగా విభజించి డీఎంఆర్‌సీ టెండర్లు పిలిచింది. కానీ ఆగస్టులో టెండర్లు రదు చేశారు. అదేమి విచిత్రమేమో గానీ 2016 డిసెంబర్ నెలలో బెజవాడ మెట్రో నిర్మాణానికి జైకా రుణం కూడా మంజూరు చేసింది.

కేంద్రం ఇలా లైట్ మెట్రోపై అభ్యంతరం

కేంద్రం ఇలా లైట్ మెట్రోపై అభ్యంతరం

మార్చి 2017లో నూతన మెట్రో విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది ఆగస్టులో ఏఎంఆర్‌సీ రెండోసారి టెండర్లు పిలిచింది. గత అక్టోబర్‌లో మళ్లీ ఎంఎఆర్సీ టెండర్లు రద్దు చేసింది. 2017 నవంబర్‌లో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు స్థానంలో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆ వెంటనే డీఎంఆర్‌సీతో తెగతెంపులు చేసుకుని లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూకు అప్పగించేందుకు సన్నాహాలు చేశారు.

English summary
AP Government sends Light Metro rail project in Bezawada to back burner. CM Chandrababu in 2014 appointed Metro Man Sridharan as Metro Bezawada adviser. But abdurptly Cancled that project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X