జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట- హైకోర్టు ఆదేశాలపై స్టే- మిషన్ బిల్డ్ ఏపీ కేసు
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో గతంలో హైకోర్టులో విచారణ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికీ, ఐఏఎస్ ప్రవీణ్ కుమార్‌కు కీలకంగా మారిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ జస్టిస్ రాకేష్ కుమార్ ఈ కేసులో తప్పులతో అఫిడవిట్ దాఖలు చేశారని ఐఏఎస్ ప్రవీణ్ కుమార్‌పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.
కాంగ్రెస్ గూటికి వైసీపీ- జగన్ పాలన ఇందిర ఎమర్జెన్సీలాంటిదే- బీజేపీ నేత షాకింగ్

జగన్ సర్కారుకు భారీ ఊరట
ఏపీలో మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ హైకోర్టులో గతంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఎలా విక్రయిస్తారంటూ ప్రభుత్వానికి అప్పట్లో హైకోర్టు అక్షింతలు వేసింది. అదే సమయంలో ఈ కేసులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ ఐఏఎస్ ప్రవీణ్ కుమార్‌పై హైకోర్టు క్రిమినల్ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. వీటిని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు.. ఇవాళ హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది.

మిషన్ బిల్డ్ ఏపీ కేసులో హైడ్రామా
ఏపీలో ప్రభుత్వ భూములను సర్కారు అవసరాల కోస వేలం వేసి, అభివృద్ధి చేయడమే మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం వివిధ జిల్లాల్లో భూములను గుర్తించింది. వీటిని వేలం వేసేందుకు సిద్ధం కాగానే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, ఇతర చర్యలకు పాల్పడ్డారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తేలుస్తామని ప్రకటించింది. అయితే ఇది తేల్చే లోపే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారని, ఆయన నిష్పాక్షికతపై తమకు నమ్మకం లేదని, ఈ కేసు విచారణ నుంచి ఆయన తప్పుకోవాలంటూ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పేర్కొన్న వివరాలు తప్పని నిర్ధారించిన హైకోర్టు.. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు ఐఏఎస్ ప్రవీణ్ కుమార్‌పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాలు పక్కనబెట్టిన సుప్రీంకోర్టు
మిషన్ బిల్డ్ ఏపీ అంశంలో రిక్యుజల్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేయటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సవాలు చేస్తూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.