జగన్ సర్కార్ కు భారీ ఊరట-రికార్డు స్ధాయి రాబడి-ఐదేళ్లలో టాప్-వృద్ధిలోనూ అదరగొట్టిన వైనం
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ రాబడి లేని రాష్ట్రానికి ఇంత ఖర్చెందుకు, ఇన్ని అప్పులెందుకు. దీనికి సమాధానం రెండున్నరేళ్ల తర్వాత లభిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఏపీ ఆదాయం భారీగా పెరిగింది. వృద్ధి రేటు మెరుగుపడింది. అప్పులు పెరుగుతున్నా ఆదాయం కూడా అంతకుమించి పెరుగుతోందని నిర్ధారణ అయింది. దీంతో ఈ రెండున్నరేళ్లలో ఎదుర్కొన్న విమర్శలకు ప్రభుత్వం దీటుగా బదులిచ్చినట్లయింది.

జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్
ఏపీలో రెండున్నరేళ్లుగా అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఆదాయాలు లేక విలవిల్లాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. ఈ రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంత ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో నమోదు చేసుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో భాగంగా నవంబర్ వరకూ ఆదాయాల్ని లెక్కగట్టగా.. రూ.88618 కోట్ల రాబడి వచ్చినట్లు తేలింది. దీంతో ప్రభుత్వానికి భారీగా రాబడులు పెరిగివట్లయింది. ఆ మేరకు అప్పులు తెచ్చుకోవాల్సిన అగత్యం కూడా తప్పినట్లయింది.

భారీగా పెరిగిన రాబడులు
రాష్ట్రంలో కరోనా పరిస్ధితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ ధర్డ్ వేవ్ బారిన పడుతున్న రాష్ట్రానికి భారీగా పన్ను వసూళ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు పెరుగుతున్నాయి. దీంతో సహజంగానే ఆ ప్రభావం ఆర్దిక వ్యవస్ధపై కనిపిస్తోంది. అన్నింటికీ మించి సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారు.. ఆ మొత్తాల్ని తిరిగి ఖర్చుపెట్టడంతో ఆ డబ్బు కాస్తా తిరిగి ఆర్ధిక వ్యవస్ధలోకి వచ్చి చేరుతోంది. దీని ప్రభావంతో పన్ను వసూళ్లతో పాటు ఇతర రాబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి.

ఐదేళ్లలో టాప్ రాబడి
గత ఐదు ఆర్ధిక సంవత్సరాలు చూసుకుంటే.. ఈ సంవత్సరం నమోదైన రాబడే అత్యధికమని నిర్దారణ అయింది. ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో నవంబర్ వరకూ ఉన్న రాబడుల్ని గమనిస్తే... 2017-18లో 58327 కోట్లు, 2018-19లో 74677 కోట్లు, 2019-20లో 63750 కోట్లు, 2020-21లో 66708 కోట్లు, 2021-22లో చూస్తే 88618 కోట్లుగా రాబడి నమోదైంది. అంటే ఈ ఐదేళ్లలో తొలిసారి నవంబర్ వరకూ రాబడుల్లో అత్యధికం నమోదైందన్న మాట. దీంతో ఆ మేరకు ప్రభుత్వానికి ఆర్ధికంగా వెసులుబాటు కూడా లభిస్తుందన్న మాట.

పెరిగిన వృద్ధి రేటు
వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా విపక్షాలు వృద్ధి రేటు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటాయి. కానీ ఈ ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు భారీగా పెరిగింది. వాస్తవానికి ప్రతీ ఏటా రాబడుల వృద్ధి 15 శాతం ఉంటుంది. కానీ ఈ రెండేళ్లలో రాష్ట్ర ఆర్ధిక వృద్ధి 39 శాతానికి చేరింది. అంటే రెండేళ్లకు నమోదు కావాల్సిన 30 శాతం వృద్ధి కంటే 9 శాతం అధిక వృద్ధి నమోదైంది. ఇది ఎంతో సానుకూల పరిణామంగా నిపుణులు చెప్తున్నారు. ఆ మేరకు ఆర్ధిక వ్యవస్ధపై సానుకూల ప్రభావం తప్పకుండా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

అప్పుల బాధలూ తప్పుతాయా?
రాష్ట్రానికి రావాల్సిన రాబడులు కరోనాకు ముందు సాధారణ పరిస్దితుల కంటే మెరుగుపడిన వేళ... ఈ మేరకు అప్పులు తీసుకోవాల్సిన అగత్యం కూడా తప్పుతుందని చెప్పవచ్చు. గత ఆర్ధిక సంవత్సరం నవంబర్ నెల నాటికి ఏపీ ప్రభుత్వం తీసుకున్ అప్పులు.. రూ.73811 కోట్లు కాగా..ఈ ఆర్ధిక సంవత్సరం అదే సమయానికి ఏపీ సర్కార్ బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న అప్పులు కేవలం రూ.49570 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి రాబడుల పెరుగుదల ప్రభావం అప్పులపైనా కనిపిస్తోందని అర్ధమవుతోంది. ఇదే విధంగా రాబడులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో అప్పుల భారం కూడా క్రమంగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.